త్వరలో హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ర్టాల కౌన్సిల్ సమావేశం

-రాష్ర్టాల ఉమ్మడి సమస్యలే అజెండా.. వైస్ చైర్మన్‌గా కే చంద్రశేఖర్‌రావు

KCR 001
దక్షిణాది రాష్ర్టాల కౌన్సిల్ తదుపరి సమావేశం హైదరాబాద్‌లో జరుగనుంది. కౌన్సిల్ 25వ సమావేశం 2012 నవంబర్ 16న బెంగళూరులో అప్పటి కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశాన్ని కర్ణాటక ప్రభుత్వం నిర్వహించింది. తాజాగా కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ చట్టం-1956లోని సెక్షన్ 16కింద దేశంలో ఈ జోనల్ కౌన్సిళ్లు ఏర్పాటవుతున్నాయి. కౌన్సిల్ చైర్మన్‌ను రాష్ట్రపతి నియమిస్తారు.

కేంద్ర హోంమంత్రులే జోనల్ చైర్మన్‌గా నియమితులవుతున్నారు. త్వరలో హైదరాబాద్‌లో 26వ జోనల్ కౌన్సిల్ సమావేశం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన జరుగనుంది. దక్షిణాది రాష్ర్టాల ఉమ్మడి సమస్యలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. కేంద్రం నుంచి అందాల్సిన సహకారం విషయంలో ఈ మండలి కృషి చేస్తుంది.

ఇరిగేషన్ ప్రాజెక్టులు, విద్యుత్ ఒప్పందాలు, నదులు, జాతీయ రహదారులు, తీరప్రాంతాల సమస్యలు, మత్స్యకారుల సమస్యలు, అంతర్రాష్ర్టాల పోలీసులతోపాటు కేంద్రం కేటాయించే నిధుల విషయంపై హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ర్టానికి ఆర్టీసీ బస్సుల ప్రయాణాలు, బస్సుల సంఖ్యపైనా చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పాటైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కౌన్సిల్ వైస్ చైర్మన్ పదవి లభించడం విశేషం. ఈ మండలిలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ర్టాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి సభ్య రాష్ర్టాలుగా ఉంటాయి.