తొలి స్పీకర్ మధుసూదనాచారి

-అన్ని పార్టీల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నిక

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్‌గా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సిరికొండ ముధుసూదనాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యరు. సోమవారం స్పీకర్ పదవికి నామినేషన్లు స్వీకరించగా మధుసూదనాచారి మినహా మరెవ్వరూ నామినేషన్‌వేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.

Madhusudhana-charyఅయితే ఈ ఎన్నికను నేడు ప్రొటెం స్పీకర్ జానారెడ్డి అధికారికంగా ప్రకటిస్తారు. తెలంగాణ తొలి స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అధికార పక్షం గత రెండు రోజులుగా వివిధ పార్టీల నాయకులతో సంప్రదింపులు జరిపింది. దీనితో మధుసూదనాచారి ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమమైంది.

సోమవారం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మధుసూదనాచారిని తోడ్కొని సభలోని వివిధ పక్షాల నేతలంతా వెంటరాగా అసెంబ్లీ సెక్రెటరీ రాజా సదారాం కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీఎల్‌పీ నేత లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, గీతారెడ్డి, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, సీపీఎం ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రనాయక్, ఎంఐఎం ఎమ్మెల్యేలు బలాల, మోహియుద్దీన్, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు పీ వెంకటేశ్వర్లు, టీ వెంకటేశ్వర్లు, మదన్‌లాల్‌లు మధుసూదనాచారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ సంతకాలు చేసిన నామినేషన్ పత్రాలను సదారాంకు అందచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కిష్ణారెడ్డి, బీఎస్‌పీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఇంద్రకరణ్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. సాయంత్రం వరకుకూడా ఒకే నామినేషన్ దాఖలు కావడంతో మంగళవారం మధుసూదనాచారిని స్పీకర్‌గా ప్రకటించనున్నారు.

మధుసూదనాచారి ప్రొఫైల్
పేరు : సిరికొండ మధుసూదనాచారి
భార్య పేరు : సిరికొండ ఉమాదేవి
పిల్లలు : ప్రదీప్, ప్రశాంత్, క్రాంతి
చదువు : ఎంఏ (ఇంగ్లీష్)
మొదటిసారిగా సభకు : 1994-99కాలంలో తెలుగుదేశం ఎమ్మెల్యే.

తెలంగాణ ఉద్యమం ప్రారంభం అవుతున్న సమయంలో కేసీఆర్‌కు దగ్గరయ్యారు. పార్టీ స్థాపనకు 8 నెలల ముందునుంచే చురుగ్గా పనిచేశారు. పార్టీ ప్రతి ప్రస్థానంలో మధుసూదనాచారి అడుగులున్నాయి. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు
ఇప్పుడు : 2014 సార్వత్రిక ఎన్నికల్లో భూపాలపల్లి అసెంబ్లీ స్థానం నుండి 7300ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు

గతం : 1994లో అసెంబ్లీకి మొదటిసారిగా ఎన్నికై వచ్చే సమయం నాటికి రాష్ట్రవ్యాప్తంగా పత్తిరైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీన్ని చూసి చలించిపోయిన మధుసూదనాచారి పత్తిరైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు పురుగుల మందును సభలోకి తెచ్చారు. ఈ సమయంలోనే సభ్యులు గుర్తించి దాన్ని బయటకు తీసుకెళ్లారు.