పోలీసు ఉద్యోగాల్లో 33% మహిళలకే

పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. తర్వలో పోలీసుశాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. జైపూర్‌లో పోలీస్‌స్టేషన్‌ను, మంచిర్యాలలో జిల్లా పోలీసుశాఖ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. సీసీసీ నస్పూర్‌లో కోల్‌బెల్ట్ కమిషనరేట్‌కు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ పోలీసుల పనితీరు భేష్ అని కొనియాడారు. తెలంగాణ వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, మావోయిస్టులు చెలరేగుతారని అప్పటి సీమాంధ్ర ప్రభుత్వాలు భయభ్రాంతులకు గురిచేశాయని, కానీ పోలీసులు తమ చేతలతో ఆశ్చరపోయేలా చేశారన్నారు.

Naini-Narsimha-Reddy

-సిర్పూర్ పేపర్ మిల్లును ఎలాగైనా తెరిపిస్తాం: హోంమంత్రి నాయిని
సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం దొంగ చాటుగా పారిపోయిందని, ఎట్టి పరిస్థితుల్లోనైనా మిల్లును తెరిపిస్తామని.. రాజీపడే ప్రసక్తే లేదన్నారు. రెండు, మూడు కంపెనీలతో మాట్లాడుతున్నామని, త్వరలో కార్మికులకు శుభవార్త చెప్తామన్నారు. కార్యక్రమంలో మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, విప్ నల్లాల ఓదెలు, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, డీజీపీ అనురాగ్‌శర్మ, అడిషనల్ డీజీపీ సుదీప్ లక్టాకియా, ఐజీ నవీన్ చంద్, డీఐజీ మల్లారెడ్డి, కలెక్టర్ జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.