తట్టెడు బొగ్గు కూడా ఇవ్వం

– మెదక్ ప్రచారంలో మంత్రి ఈటెల రాజేందర్
– రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విద్యుత్ ఇవ్వాల్సిందే
– కిరికిరి పెడితే ఆంధ్రాకు తట్టెడు బొగ్గు కూడా ఇవ్వం
– ప్రభుత్వంపై విషం కక్కుతున్న ఆంధ్రా మీడియా
– ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్

Etela rajendar 01

ఆంధ్రా సర్కారు తిరకాసు పెట్టి తెలంగాణకు విద్యుత్ రాకుండా చేస్తే తెలంగాణ నుంచి తట్టెడు బొగ్గును కూడా ఆంధ్రకు పోనివ్వబోమని మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. రాష్ట్రంలో కరెంటు కష్టాలు తాత్కాలికమేనని, వచ్చే ఏడాది మార్చి నాటికి ఆ కష్టాలు తీరుతాయన్నారు. మెదక్ పార్లమెంటు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట, చిన్నకోడూరు మండలాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. వర్షం పడుతున్నా లెక్కచేయకుండా ఈటెలకు ప్రజలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. గొడుగులు పట్టుకొని పార్టీ నేతలు ఆయనను అనుసరించారు.

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన 53 శాతం విద్యుత్ వాటా ఇవ్వాల్సిందేనని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆంధ్రా సర్కారు తిరకాసు పెట్టి విద్యుత్‌ను రాకుండా చేస్తే తెలంగాణ నుంచి తట్టెడు బొగ్గును కూడా ఆంధ్రకు పోనివ్వబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరెంటు కష్టాలు తాత్కాలికమేనని, వచ్చే ఏడాది మార్చి నాటికి కష్టాలు తీరుతాయన్నారు. 2017 నాటికి రాష్ట్రంలో కరెంటు కష్టాలనేవే ఉండవని, మిగిలు ఉత్పత్తి సాధించి ఇతర రాష్ర్టాలకు సరఫరా చేసే స్థితికి చేరుకుంటామని తెలిపారు. 12 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ప్రణాళికలు ప్రభుత్వం సిద్ధం చేసిందని చెప్పారు. మెదక్ పార్లమెంటు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట, చిన్నకోడూరు మండలాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. వర్షం పడుతున్నా లెక్కచేయకుండా ఈటెలకు ప్రజలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. గొడుగులు పట్టుకొని పార్టీ నేతలు ఆయనను అనుసరించారు. వర్షంలోనే మంత్రి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రజలుద్దేశించి ఈటెల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో ప్రజలు కోరుకున్న సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. పదమూడేండ్ల్లు ఉద్యమాలు చేసిన తమకు తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు.

రాజకీయ భవిష్యత్ లేకుండా పోయిందన్న అక్కసుతోనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైనా కాకముందే ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నామని, ఒక్క క్యాబినెట్ సమావేశంలోనే 43 అంశాలపై కూలంకుశంగా చర్చించి ఆమోదించిన ఘనత దేశంలో మరెక్కడైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ మంత్రులకు నైపుణ్యం లేదన్న ప్రతిపక్షాల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి కోట్ల రూపాయలు దిగమింగే నైపుణ్యం మాకు లేదు. మాకున్నదల్లా అక్రమించిన భూముల్లో అక్రమ కట్టడాలను కూల్చివేసే నైపుణ్యం. ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించే నైపుణ్యం అని పేర్కొన్నారు.

సీమాంధ్రలో బీడీ కార్మికులు లేరు కాబట్టే ఇన్నాళ్ళుగా వారు బీడీ కార్మికుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని, తెలంగాణ ప్రభుత్వం బీడీ కార్మికుల సంక్షేమం కోసం కృషి అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విపక్షాల అర్థరహిత విమర్శలకు సీమాంధ్ర మీడియా తోడై ప్రభుత్వానికి వ్యతిరేకంగా విషం కక్కుతున్నదని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఎనుగు రవీందర్‌రెడ్డి, నాయకులు రాధాకిషన్‌శర్మ, కుంట వెంకట్‌రెడ్డి, ఎంపీపీ మాణిక్యరెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు కమల, కొండం సంపత్‌రెడ్డి, ప్రభాకర్, కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.