తరలివచ్చిన తెలంగాణ

-పల్లె నుంచి పట్నం దాకా దారులన్నీ అటువైపే
-లక్షలాదిగా తరలి వచ్చిన తెలంగాణ ప్రజానీకం
-జన సంద్రంలా మారిన హైదరాబాద్‌లో రహదారులు
అధికారం చేపట్టాక తొలిసారిగా నిర్వహించిన భారీ బహిరంగ సభతో టీఆర్‌ఎస్ తనకు తిరుగులేదని చాటి చెప్పింది. 14 ఏండ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో సభలు, సమావేశాలు నిర్వహించినా దానికి తెలంగాణ సెంటిమెంటు మాత్రమే కారణమంటూ ప్రతిపక్షాలు వాదిస్తూ వచ్చాయి. అయితే ప్రభుత్వం చేపట్టిన పదినెలల తర్వాత నిర్వహించిన సభకు పది లక్షలకు పైగా జనాన్ని ఆకర్షించడం ద్వారా టీఆర్‌ఎస్ ఆ వాదనలను పూర్వపక్షం చేయగలిగింది. తెలంగాణ కదిలొచ్చిందా.. అన్నట్లుగా రాష్ట్ర రాజధాని జనసంద్రంలా మారిన వైనం టీఆర్‌ఎస్ స్టామినాకు అద్దం పట్టింది.సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో సోమవారం నిర్వహించిన పార్టీ ఆవిర్భావ బహిరంగ సభకు లక్షలాది మంది తరలి వచ్చారు. పది జిల్లాల నుంచి జనం రాజధానికి బారులు తీరారు. వాస్తవానికి 10లక్షల మందితో సభ నిర్వహించాలని భావించి అందుకు తగ్గట్టుగా పెరేడ్ గ్రౌండ్‌లో సభ ఏర్పాటు చేశారు.అయితే అంచనాలు మించి ప్రజలు రావడంతో పరేడ్ గ్రౌండ్ మైదానం సరిపోలేదు. సాయంత్రం అయిదింటికే గ్రౌండ్ నిండిపోగా జిల్లాల నుంచి వచ్చే పలువాహనాలు రహదారులపైనే ట్రాఫిక్‌జాంలో చిక్కుకుపోయాయి. ప్రధాన జాతీయ రహదారులన్నీ 30-40కి.మి. వరకు స్తంభించాయి.

KTR rally towards TRS Public Meet

ఆకట్టుకున్న అధినేత ప్రసంగం..
టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం ఉద్వేగంగా, ఉత్సాహ భరితంగా సాగింది. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం మొదలుకుని ఎదుర్కొన్న ఆటుపోట్లు, జయపజయాలు, అనుభవాలను కేసీఆర్ ఈ సందర్భంగా నెమరు వేసుకున్నారు. బంగారు తెలంగాణ స్వప్నం సాధించేందుకు తాను చేపడుతున్న ప్రణాళికను ప్రజలకు వివరించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని అంశాలను కూడా అమలు చేస్తున్న వైనాన్ని గుర్తు చేశారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకం మేలో ప్రారంభిస్తామని ప్రకటించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఉద్యోగాల నియామకాలపై స్పష్టత ఇచ్చారు. విపక్షాలు చేస్తున్న అనవసర రాద్ధాంతాన్ని తిప్పికొట్టారు. టీడీపీ నాయకులను తూర్పారబట్టారు.

అలరించిన ధూంధాం
సోమవారం పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన విజయగర్జనలో ధూంధాం కళాకారులు తమ ఆటపాటలతో ప్రజలను ఉర్రూతలూగించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటల నుంచే కళాకారుల ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. భానుడి ప్రతాపాన్ని సైతం మరిపించిన ఆ కార్యక్రమం ప్రజలను తన్మయులను చేసింది. ఉత్సాహం పట్టలేక వేదికపై ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం కళాకారుల ఆటపాటలకు పదం కలిపి చిందులేశారు.
అలరించిన పాటలివే..
-అయ్యోనివా..నువ్వు అవ్వోనివా అని తేలు విజయ ఆలపించిన గేయానికి ఈలలు కేకలతో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
-హుస్నాబాద్ శంకర్‌బాబు పాడిన ఉస్మానియా యూనివర్సిటీలో ఉదయించిన కిరణమా పాటకు సభ చప్పట్లతో దద్దరిల్లింది.
-హోంమంత్రి నాయిని, ఎంపీ జితేందర్ రెడ్డి నృత్యాలతో ఉత్సాహాన్ని నింపారు.
-బతుకమ్మ పాటకు వేదికపై ఉన్న ఎంపీలు కవిత, జితేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి చప్పట్లతో జోష్ నింపారు.
-ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర సాధన ఉద్యమంపై లంబాడీ బాషలో పాడిన పాటలకు మంచి స్పందన వచ్చింది.
-తెలంగాణ గ్రామ దేవతలపై పాటలకు బోనాలు ఎత్తుకొని వచ్చిన మహిళలు, పోతరాజులు డ్యాన్స్ చేశారు.
-సన్నబియ్యం భోజనం మీద హాస్టల్ విద్యార్థుల సంబరం మీద రసమయి పాడిన పాట ఉద్వేగాన్ని నింపింది.
-ఏపూరి సోమన్న ఏమని పాడను ఈ పాట..నా పాట అని జనరంజకంగా పాడారు.
-కొమ్మలలో లేడిపిల్ల అనే పాటకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డి నృత్యం చేశారు.
-ప్రొఫెసర్ జయశంకర్ స్పూర్తితో తెలంగాణ పల్లెల్లో పొద్దుపొడిచెను నగదారిలో అనే గేయాన్ని సంతోషి బృందం ఆలపించింది.

Public Meet

సామాన్యుడిలా ప్రజలతో కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి 14వ వార్షికోత్సవ సభలో, పంచాయితీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. సోమవారం పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో ఇతర నాయకులకు భిన్నంగా సామాన్యునిలా జనంలో నుంచి సభా వేదికకు వచ్చి ప్రజలను ఆకర్షించారు. అధికార దర్పానికి, భేషజాలకు తావు లేకుండా వేదికపైకి వచ్చారు. పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ మినహా గన్‌మెన్లు కూడా లేకుండా సభా స్థలికి చేరుకుని, సభకు హాజరైన ప్రజానీకంతో మాట్లాడుతూ, కరచాలనం చేస్తూ వేదికను చేరుకున్నారు. అసలు విషయానికి వస్తే సభ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు జనంలో అలజడి చెలరేగింది. సభకు హాజరైన జనమంతా లేచి నిల్చున్నారు. సభా వేదికపై ఉన్న వారికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కూర్చోండి.. కూర్చోండి అంటూ వేదికపై నుంచి సూచనలు చేశారు. అంతలోనే కేటీఆర్ వస్తున్నారన్న సమాచారంతో నిర్వాహకులు విషయాన్ని ప్రకటించారు. వేదికపైకి రావడానికి బారికేడ్లు అడ్డుగా ఉండటంతో వాటి పై నుంచి దూకి వేదికను చేరుకున్నారు. కేటీఆర్‌ను చూసిన జనం కేటీఆర్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
కంట్రోల్.. కంట్రోల్..
-వేదికపైనుంచే హోం మంత్రి ఆదేశాలు
కిక్కిరిసిపోయిన పరెడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ భారీ బహిరంగసభలో రాష్ట్రహోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తనశాఖ అధికారులకు నేరుగా తానే మైకులో సూచనలు చేస్తూ సభను సమన్వయం చేశారు. కార్యకర్తలు పోలీసు అధికారులకు సహకరించాలని పదేపదే చెప్పారు. నాయిని కంటే ముందు పార్టీ నేతలు బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పోలీసు అధికారులు సహకరించాలని చెబుతుండగా, సభా వేదికపై ఉన్న నాయిని మైక్ అందుకుని తనశాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. సాయంత్రం 5 గంటలు కావస్తుండగా వివిధ జిల్లాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలిరావడంతో తోపులాట జరిగింది. దీంతో కార్యకర్తలను గ్రౌండ్‌లో ఉన్న ఖాళీ ప్రదేశాలకు పంపించాలని పోలీసులకు చెప్పారు. అక్కడ విధుల్లో ఉన్న డీసీపీలు కమలహాసన్‌రెడ్డి, సుధీర్‌బాబు వేదిక వద్దకు వచ్చి నాయకులతో మంతనాలు జరిపి వెళ్లారు.