తెలంగాణలో అధికారం చేపట్టబోయే పార్టీ అధ్యక్షుడిని: కేసీఆర్

హైదరాబాద్: ఆంధ్ర ఉద్యోగులను పంపిస్తామని, పోలవరం అడ్డుకుంటామని కేసీఆర్ అన్నందుకు నిన్న విరుచుకుపడ్డ కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ సమాధానం చెప్పారు. త్వరలో తెలంగాణలో అధికారం చేపట్టబోయే పార్టీకి నేను అధ్యక్షుడిగా ఇవన్ని చేయిస్తానని ఆయన పేర్కొన్నారు. నేను తెలంగాణ గురించి మాట్లాడితే కాంగ్రెస్ నేతలకు నొప్పెందుకని ప్రశ్నించారు. 2005 నుంచే మేం పోలవరం గురించి కొట్లాడుతున్నామన్న సంగతి గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతల తీరు సంస్కారహీనంగా ఉందన్నారు.

ఉమ్మడి రాజధాని వద్దన్నం, ఉద్యోగులకు ఆప్షన్లు ఉండొద్దన్నం, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ కోరాం అయినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ నేతలు నోరు మూసుకున్నారు. పొన్నాల మంత్రి పదవంతా అసమర్ధుడి జీవనయాత్రలా సాగిందన్నారు. జలయజ్ఞాన్ని ధన యాజ్ఞంగా మార్చిన దొంగల ముఠా నాయకుడు పొన్నాల అని విమర్శించారు. పొన్నాల తెలంగాణలో ఒక్క ప్రాజక్టైనా పూర్తి చేశాడా అని అడిగాడు. ఆంధ్రాలోని అక్రమ ప్రాజెక్టులకు అధికార ముద్ర వేసింది పొన్నాల కాదా అని అడిగారు. ఉద్యమం జరిగినపుడు అమెరికాకు పోయి పడుకున్నాడని విమర్శించారు. పోతిరెడ్డిపాడుకు నీటి తరలింపును పొన్నాల సమర్థించిండని ఆ సీడీలు త్వరలో బయటపెడతామన్నారు.
ఆంధ్రోళ్లకు పొన్నాల లక్ష్మయ్య, డీశ్రీనివాస్ తొత్తులన్నారు. పొన్నాలకు దమ్ముంటే పోలవరంపై ఆర్డినెన్స్ ఆపించాలన్నారు. దామోదర రాజనర్సింహ మిడిసిపాటు ఆపాలన్నారు. తెలంగాణ సెక్రట్రేయిట్ నిండా ఆంధ్రా ఉద్యోగులుండాలా అని ప్రశ్నించారు. 90 శాతం ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణ సచివాలయంలో ఉండటం దామోదర రాజనర్సింహ సమర్థిస్తాడా అని అడిగారు.
తెలంగాణకు న్యాయం జరిగే వరకు నేను కొట్లాడుతానని తెలిపారు. ప్రపంచంలో ఏ శక్తీ నన్ను ఆపలేదు.. పిట్ట బెదిరింపులకు నేను భయపడనన్నారు. తెలంగాణలో మేమే అధికారంలో వస్తం… చెప్పింది చేస్తామన్నారు. వచ్చేది జయనామసంవత్సరం.. తెలంగాణకు జయం చేకూరుతుందన్నారు.
ఆంధ్రాలోని అక్రమ ప్రాజెక్టులకు నీళ్లు పోనివ్వమన్నారు. పోలవరంకు మేం వ్యతిరేకం కాదు.. డిజైన్ మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణలోని ఎనిమిది జిల్లాలు వెనకబడినవే.. వాటికి ప్రత్యేక హోదా రావాల్సిందేనని డిమాండ్ చేశారు.