తెలంగాణ వైపు విదేశీ కంపెనీల చూపు..

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు అధిక సంఖ్యలో వస్తున్నాయని, భారతదేశంలోకి అడుగుపెట్టే పలు కంపెనీలు తెలంగాణ వైపు చూస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. హిటాచి సొల్యూషన్స్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను సోమవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

KTR launched the Hitachi solutions
-రాష్ట్ర సర్కారు ప్రణాళికలు సఫలం
-12 రోజుల్లో 35 పరిశ్రమలకు అనుమతి
-హిటాచి కంపెనీలో 400మందికి లభించిన ఉపాధి
-7న సీఎం చైనా, దక్షిణ కొరియా పర్యటన
-గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఐటీ మంత్రి కేటీ రామారావు
-నవంబర్‌లో జపాన్‌లో పర్యటిస్తామని వెల్లడి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర సర్కారు చేపట్టిన ప్రణాళికలు సఫలం అవుతున్నాయన్నారు. తోషిబా వంటి ప్రముఖ కంపెనీకి ఇక్కడ పరిశ్రమను నెలకొల్పేందుకు 12 రోజుల్లో అనుమతిచ్చినట్లు ఆయన వెల్లడించారు. అమెరికాకు చెందిన హిటాచి సంస్థకు పలు విభాగాల్లో పరిశ్రమలున్నాయని, దేశవ్యాప్తంగా హిటాచి సంస్థ సాఫ్ట్‌వేర్ రంగంలో 700 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నదని, అందులో తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన దాదాపు 400 మందికి ఉపాధి కల్పించడం హర్షించదగ్గ విషయమని అన్నారు.

ఈనెల ఏడున ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చైనా, దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లనున్నారని, అక్కడి పరిశ్రమాధిపతులు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఏర్పడొచ్చని తెలిపారు. కేవలం 12 రోజుల్లోనే 35 పరిశ్రమల స్థాపనకు ఏకగవాక్ష పద్ధతిలో అనుమతులిచ్చామని, మరో 17 పరిశ్రమలకు అనుమతులిచ్చే ప్రక్రియ కొనసాగుతున్నదని కేటీఆర్ వెల్లడించారు. జూన్ 12 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.5వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలను స్థాపించేందుకు అనుమతించినట్లు తెలిపారు. జపాన్ నుంచి కూడా పరిశ్రమల స్థాపనకు ఆహ్వానిస్తామని ఇందుకు అక్టోబరు చివరివారం లేదా నవంబర్ మొదటివారంలో ఆ దేశ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను రచిస్తుందని చెప్పారు.

హిటాచి సొల్యూషన్స్ ఇండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ అనంత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఇంజినీరింగ్ కళాశాలలు, బిజినెస్ స్కూళ్లలో ఆయా కోర్సులను చేస్తున్న విద్యార్థులను ఎంపిక చేసి, మైక్రోసాఫ్ట్ నైపుణ్యాలపై అవగాహన కల్పించి భవిష్యత్‌లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు టాస్క్-హిటాచి కుదుర్చుకున్న ఒప్పందపై టీఏఎస్కే సీఈఓ సువిజ్ నాయర్ సంతకం చేశారు. కార్యక్రమంలో ఐటీ కార్యదర్శి జయేష్‌రంజన్, హిటాచి సీనియర్ ఉపాధ్యక్షుడు ఎమజాకి పాల్గొన్నారు