తెలంగాణ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు

-అధికారులకు సీఎం ఆదేశం
-రెండువారాల గడువు నిర్దేశం

KCR 0025

తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రెండు వారాల్లో తెలంగాణ సమగ్రాభివృద్ధికి అవసరమైన కసరత్తును పూర్తి చేసి, రోడ్ మ్యాప్‌తో వాటిని అమలు చేసేందుకు ముందుకు పోవాలని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పథకంపై డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)తో నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మతోపాటు ప్రభుత్వ కార్యదర్శులతో సీఎం సమీక్ష జరిపారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో జరిగిన పనులు, అమలు చేసిన పథకాలు అన్నీ ఆంధ్రా కోణంలో జరిగాయని అధికారులతో సీఎం అన్నారు. ఇప్పటి నుంచి తెలంగాణ దృక్పధంతో ప్రభుత్వ విధానాల రూపకల్పన జరగాలని అధికారులకు సూచించారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి అన్ని శాఖల అధికారులు స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో తెలంగాణ అభివృద్ధికి ప్రణాళికలను తయారు చేయాలని సీఎం ఆదేశించారు.

పదవీ విరమణ వయసు పెంచొద్దు
సీఎం కేసీఆర్‌కు విద్యార్థి నేతల విన్నపం

తెలంగాణలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచవద్దని ఓయూ, కేయూ విద్యార్థి జేఏసీ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కోరారు. మంగళవారం సచివాలయంలో వారు సీఎంను కలిసి ఈ అంశంపై వినతి పత్రం సమర్పించారు. పదవీ విరమణ వయసు పెంచడంవల్ల నిరుద్యోగ యువతకు తీరని నష్టం వాటిల్లుతుందని విద్యార్థి నేతలు పిడమర్తి రవి, దూదిమెట్ల బాలరాజు ఆందోళన వ్యక్తంచేశారు. ఆంధ్రలో పదవీ విరమణ వయసు పెంచడం వల్ల ఇక్కడి ఆంధ్ర ఉద్యోగులు వారి ప్రాంతాలకు వెళ్లిపోతారని, తెలంగాణలో కూడా పదవీ విరమణ వయసు పెంచడం వల్ల వారంతా ఇక్కడే ఉండేందుకు కుట్రలు చేస్తారని వారు ఆరోపించారు. పదవీ విరమణ వయసు పెంచకుండా ఉంటే తెలంగాణ యువతకు కొలువులు లభిస్తాయని సీఎంను కోరామని వారు తెలిపారు.