తెలంగాణ రాష్ట్ర ప్రగతిని దశదిశలా చాటాలి

-ఎన్నారైలే మా బ్రాండ్ అంబాసిడర్లు
-ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానం చేయాలి
-రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సహకరించాలి
-కేసీఆర్ విజన్‌కు పలు రాష్ట్రాలు, కేంద్రం నుంచి అభినందనలు
-జ్యూరిచ్‌లో ఎన్నారైలతో ముఖాముఖిలో కేటీఆర్
-ప్రభుత్వ పథకాలు..అమలును వివరించిన మంత్రి

తెలంగాణ ఏర్పాటునాటి అయోమయ పరిస్థితి నుంచి తమ ప్రభుత్వం అద్భుతమైన ప్రగతిదిశగా రాష్ట్రాన్ని తీసుకుపోతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారక రామారావు చెప్పారు. బంగారు తెలంగాణ కల సాకారంలో ప్రవాస తెలంగాణవాసులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం గత నాలుగేండ్లలో సాధించిన అద్భుతమైన ప్రగతిని ఎన్నారైలు దశదిశలా చాటాలని కోరారు. ప్రతి తెలంగాణ ప్రవాస భారతీయుడు రాష్ర్టానికి ఒక గుడ్‌విల్ అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని అన్నారు. ముఖ్యంగా రాష్ర్టాన్ని ఇతర దేశాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు పరిచయం చేసేందుకు, ఆసక్తిగల పారిశ్రామికవేత్తలను తెలంగాణ ప్రభుత్వంతో అనుసంధానం చేసేందుకు ఎన్నారై మిత్రులు కలిసి రావాలని విజ్ఞప్తిచేశారు. నాడు తెలంగాణ ఉద్యమంలో, నేడు సొంత రాష్ట్రంలో ఎన్నారైలది కీలక పాత్ర అని చెప్పారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన మం త్రి కేటీఆర్.. ఈ సందర్భంగా జ్యూరిచ్ నగరంలో సోమవారం తెలంగాణ ఎన్నారైలు ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, పాలసీలు, వాటి అమలువంటి అంశాలతోపాటు.. రాష్ట్ర రాజకీయాల గురించి మంత్రి మాట్లాడారు. దశాబ్దంన్నర క్రితం ఏర్పాటైన రాష్ర్టాలు కూడా ఇంకా పూర్తిగా కుదురుకోని పరిస్థితుల్లో ఉంటే, తెలంగాణ రాష్ట్రం మాత్రం మూడున్నర ఏండ్లలోనే అనేక రంగాల్లో దేశంలోనే ఆదర్శవంతమైన విధానాలతో ముందుకు పోతున్నదని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఆకాంక్షించిన లక్ష్యాల సాధన దిశగా ప్రయాణం మొదలైందని అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణ సాధిస్తామని మంత్రి ఉద్ఘాటించారు. మొదట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారే ప్రస్తుతం అభినందిస్తున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. తమ వద్ద కూడా టీఆర్‌ఎస్‌ను స్థాపించాలంటూ పొరుగు రాష్ట్ర ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయంటేనే తెలంగాణలో పాలన ఎంత జనరంజకంగా సాగుతున్నదో అర్థమవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ విజన్‌కు కేంద్ర ప్రభుత్వంతోపాటు పలు రాష్ర్టాల నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు.

తెలంగాణ ప్రజల కరంట్ కష్టాలు తొలిగాయి: కేటీఆర్
రాష్ట్రం విడిపోతే కరంటు సమస్యలు వస్తాయన్న ఆనాటి కాం గ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాటలను మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. రాష్ట్రం వచ్చిన తరువాత తెలంగాణ ప్రజలకు పవర్ కష్టాలు తొలిగిపోయాయి. కానీ కాంగ్రెస్‌కు మాత్రం పవర్ పోయింది అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మొత్తం కాంగ్రెస్ పార్టీకి పవర్ పోతున్నదని, అందుకే రైతాంగానికి ఇస్తున్న 24 గంటల కరంట్ సరఫరాను సైతం ఆ పార్టీ రాజకీయం చేస్తున్నదని మంత్రి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం తన పరిపాలనలో ప్రజల కనీస అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. రాష్ట్రం అంతటా తాగు, సాగు నీరు కల్పనకే ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రజల కనీస అవసరాలైన రోడ్లు, ఫుట్‌పాత్‌లు, తాగునీటి సరఫరా వంటి ప్రాథమిక అంశాలపైన దృష్టిసారించినట్లు మంత్రి తెలిపారు. ప్రసంగం అనంతరం ఎన్నారైలు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి ఓపికగా సమాధానాలు చెప్పారు. ప్రభుత్వ దవాఖానలు, ప్రభుత్వ స్కూళ్లను చక్కదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఎన్నారైలు తెలంగాణలో భూములను ధైర్యంగా కొనవచ్చని చెప్తూ.. భూరికార్డులను ప్రక్షాళనచేసి, అన్నీ ఆన్‌లైన్‌లోకి తెస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. చెరువుల పునరుద్ధరణ, హైదరాబాద్ నగరంలో మెరుగుపడిన శాంతిభద్రతలు, వాతావరణ కాలుష్య నియంత్రణ చర్యలు, క్రీడల అభివృద్ధి మొదలయిన అంశాలపైనా కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలోనే ప్రజల ఆకాంక్షలను తెలుసుకున్న గులాబీ దళపతి కేసీఆర్ నాయకత్వంలో ఆదర్శప్రాయంగా ముందుకు సాగుతున్నామన్నారు. గత రెండేండ్లలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ప్రజల నాడి తెలిసిన మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలకు దగ్గరుండి రూపకల్పన చేసి, అమలును నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వివరించారు. నగరాభివృద్ధికి ఎన్నారైలు చేసే సూచనలు, సలహాలు తీసుకునేందుకు అందుబాటులో ఉంటామన్నారు. జ్యూరిచ్ నగరంలోని శ్రీధర్ గండె, అల్లు కృష్ణారెడ్డి, అనిల్ జాలా, కిశోర్ తాటికొండ తదితరులు ఈ సమావేశాన్ని నిర్వహించారు. స్వీడన్, జర్మనీ, యూకే, స్విట్జర్లాండ్ దేశాల నుంచి తెలుగువారు ఈ సమావేశానికి హాజరయ్యారు.