తెలంగాణ ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధిస్తా

-నేడు ఢిల్లీలో కమిటీ తొలి సమావేశం

Vinod Kumar

టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్ కేంద్ర జలవనరుల శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. గతంలో ఎంపీగా ఉన్నపుడు ఇదే స్థాయిలోని ఎనర్జీ కమిటీకి సభ్యుడిగా పని చేసిన ఆయనకు రెండోసారి ఈ అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం తొలిసారిగా ఈ స్థాయీ సంఘం ఢిల్లీలో భేటీ కానుంది. మెదక్ ఉప ఎన్నికల ప్రచారంలోనున్న ఆయన సమావేశంలో పాల్గొనేందుకు గురువారం ఢిల్లీకి వెళ్లారు.

ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ.. కచ్చితంగా తెలంగాణకు చెందిన ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. నేను గతంలో (2004-09) ఎనర్జీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశాను. ఆ సమయంలోనే వరంగల్ జిల్లా భూపాలపల్లి విద్యుత్తు ప్లాంటు మంజూరు కావడంలో నా వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాను. ఈసారి జలవనరుల శాఖకు సంబంధించి అవకాశం దక్కింది. నిజానికి తెలంగాణ ఉద్యమం నీటి దోపిడీకి వ్యతిరేకంగానే ఉధృత రూపం దాల్చింది. తెలంగాణకు కృష్ణా, గోదావరివంటి జీవ నదులను ప్రకృతి వరంగా ఇచ్చినా… సమైక్య ప్రభుత్వాలు తీరని అన్యాయం చేశాయి. తెలంగాణ రాష్ట్ర సమితి న్యాయమైన వాటా కోసం అనేక ఉద్యమాలను చేపట్టింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయిన తరువాత ఈ అంశంపై ప్రధానంగా దృష్టిపెట్టారు. ఇదే క్రమంలో నాకు ఈ అవకాశం దక్కడం సంతోషంగా ఉంది అని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. జలవనరుల శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా తెలంగాణకు భారీగా నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానని వినోద్‌కుమార్ హామీ ఇచ్చారు.

వినోద్ నియామకంపై టీఆర్‌ఎస్ హర్షం
కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను జలవనరుల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియమించడంపై టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జలవనరుల గురించి, తెలంగాణ నీటి లభ్యత గురించి, గోదావరి, కృష్ణా జలాలు, మన వాటా, ప్రాజెక్టుల గురించి వినోద్‌కుమార్‌కు పూర్తి అవగాహన ఉందన్నారు.