తెలంగాణ పర్యాటక లోగో ఆవిష్కరించిన సీఎం

– డిజైన్ చేసిన ఐఐటీ విద్యార్థి
– లోగోలో కాకతీయ తోరణం..ఉదయిస్తున్న సూర్యుడు

KCR-07

తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కొత్త లోగోను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చారిత్రక, పర్యాటక కేంద్రాలను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. వందల ఏండ్ల చరిత్ర కలిగిన గోల్కొండ కోట ఇప్పటికీ ప్రపంచ పర్యాటక సంస్థల లిస్టులో లేకపోవడం ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యంవల్లేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనైనా గోల్కొండ కోట, కాకతీయ ఖ్యాతి, వరంగల్ జిల్లాలోని రామప్ప, వేయి స్థంబాల గుడి, మెదక్ చర్చి తదితరాలన్నింటినీ కలిపి తెలంగాణ రాష్ట్ర పర్యాటక కేంద్రాలను రూపొందించాలని సీఎం ఈ సందర్భంగా పర్యాటక అధికారులకు సూచించారు. రాష్ట్ర టూరిజం శాఖ లోగోను శశిధర్‌రెడ్డి డిజైన్ చేశారు. శశిధర్‌రెడ్డి ముంబైలో ఐఐటీ పూర్తి చేశారు. తెలంగాణ టూరిజం లోగోలో కాకతీయ కళాతోణం, తోరణం మధ్యలో నుంచి పచ్చని గుట్టల నడుమ ఉదయించే సూర్యుడు గుర్తు ఉంటుంది. కాకతీయ కళాతోరణం తెలంగాణ చారిత్రక నేపథ్యానికి చిహ్నం అయితే, తోరణానికి ఇరువైపులా ఆంగ్ల అక్షరమాలలో టీ గుర్తులు తెలంగాణ, టూరిజం అనే పదాలను సూచిస్తాయి.

తోరణం మధ్యలో రెండు గుట్టల నడుమ ఉదయించే సూర్యుడు తెలంగాణ టూరిజానికి ఉజ్వల భవిష్యత్తు ఉందనే అర్థంతో పాటు, ఎకో టూరిజం అనే అర్థాన్ని కూడా ఇస్తుందని లోగో రూపకర్త శశిధర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ పర్యాటక లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రణాళిక, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య, టీఎన్‌జీవో అధ్యక్షులు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, పర్యాటక శాఖ ఎండీ సుమిత్‌సింగ్, తెలంగాణ టూరిజం శాఖ అడిషనల్ చీఫ్ బీ శ్రీనివాస్, తెలంగాణ టూరిజం శాఖ ఉద్యోగ సంఘం నాయకులు బాలాజీ, హన్మంతరెడ్డి, జనార్ధన్, నర్సింగరావులు పాల్గొన్నారు.