తెలంగాణ నిలిచి గెలుస్తుంది

-పెట్టుకున్న లక్ష్యాలన్నీ సాధిస్తాం
-అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఆదర్శ పాలన
-వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయపై రాష్ర్టాల ఆసక్తి
-ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్న సీఎం కేసీఆర్
-60 ఏండ్ల దరిద్రం పది నెలల్లో పోదు
-విపక్షాలది పనిలేని వ్యవహారం
-సర్కారుకు సహకారం అందివ్వాలి
-పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

KTR addressing in Parakal Meeting

ఒకవైపు సంక్షేమ పథకాలను స్ఫూర్తివంతంగా నిర్వహిస్తూ, మరోవైపు అభివృద్ధి పథకాలను వినూత్నంగా శాశ్వత ప్రాతిపదికగా అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశంలో ఆదర్శప్రాయంగా నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది అని ఎకసక్కాలు చేసిన వారున్నారని, వారికి దీటైన జవాబిస్తూ తెలంగాణ రాష్ట్రం నిలిచి గెలుస్తుందని ఆయన అన్నారు. స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో కలలుగన్న అన్ని లక్ష్యాలను సాధించి దేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా నిలబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తున్నదని, దేశంలోని మిగతా రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయబోమని, చిత్తశుద్ధితో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను ముద్దాడి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం వరంగల్ జిల్లా పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పరకాలలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి అజ్మీరా చందూలాల్, ఎంపీలు సీతారాంనాయక్, బాల్కసుమన్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, జిల్లా పార్టీ అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందరరావు, పార్టీ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డితో పాటు మంత్రి బాల్యస్నేహితుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజల కష్టాలు తెలిసిన సీఎం..
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన నాయకుడని కేటీఆర్ అన్నారు. ఉద్యమనాయకుడిగా 14 ఏండ్లు ఉద్యమాన్ని ఎంత పట్టుదలతో నడిపించారో అంతే పట్టుదలతో, దీక్షతో ప్రజల సంక్షేమం కోసం కష్టపడి పనిచేస్తున్నారన్నారు. ఆసరా ఫించన్ల పంపిణీ దేశంలోనే ఆదర్శ కార్యక్రమమని ఆయన అభివర్ణించారు. హాస్టళ్లు, స్కూళ్లల్లో చదువుకునే విద్యార్థులు పోషకాహార లోపంతో ఇబ్బంది పడడం చూసి హైదరాబాద్‌లో తన మనవడు ఏ నాణ్యమైన సన్నబియ్యం బువ్వను తింటున్నాడో అటువంటి సన్నబియ్యం బువ్వను ఎవరూ అడగకున్నా అందిస్తున్నారని చెప్పారు. రేషన్ బియ్యాన్ని మనిషికి నాలుగు కిలోల నుంచి ఆరుకిలోలకు పెంచడమే కాకుండా సీలింగ్‌ను ఎత్తివేసి ఇంట్లో ఇంతమంది ఉంటే అంతమందికి చొప్పున ఇస్తున్న సీఎం కేసీఆర్ మాత్రమేనని వివరించారు. వచ్చే నాలుగేళ్లల్లో ఇంటింటికి రక్షితమైన మంచినీటిని కుళాయిల ద్వారా అందివ్వకుంటే తాను ఎన్నికల్లో ఓట్లు అడగను అని చెప్పిన దమ్మున్న మొనగాడు అని ప్రశంసించారు.

విపక్షాలకు పని లేకుండా పోయింది..
60 ఏండ్లుగా రాష్ర్టాన్ని కాంగ్రెస్, టీడీపీ భ్రష్టు పట్టించాయని ఆ దరిద్రం, గబ్బు పదినెలల్లో పోవని కేటీఆర్ అన్నారు. కరెంట్ విషయంలో ముఖ్యమంత్రి చెప్పినట్టుగా జరగదని వారు కలలుగన్నారని అయితే వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయని అన్నారు. గత 30 సంవత్సరాల్లో ఏనాడూ లేని విధంగా మండువేసవిలో కోతలే లేని కరెంటు సరఫరా చేస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని ఆయన సభికుల హర్షధ్వానాల మధ్య తెలిపారు. రాబోయే రోజుల్లో కరెంట్ కోతల్లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచి గెలవబోతున్నదని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీలే రాష్ట్రంలో కరెంట్ సమస్యలకు కారణమన్నారు. అయినా కరెంటు కొరత యథాతథంగా ఉంటుందని, ఈ సీజన్‌లో కూడా కరెంట్ కష్టాలు ఉంటాయి…తమకు చేతి నిండా పని దొరుకుతుందని ప్రతిపక్షాలు కలలు గన్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ పనుల్ని, విధానాలను అభాసుపాలు చేయాలని తలచిన విపక్షాలకు ఇప్పుడు పనేలేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. అందుకే మతితప్పి ప్రభుత్వం ఏ పనిచేసినా సరే విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని అన్నారు. దశాబ్దాల పాటు పాలన సాగించిన ఈ పార్టీలు ఏవైనా వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలను తలపెట్టాయా? అని నిలదీశారు. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల పాలన సాగిస్తున్న ప్రభుత్వానికి ప్రజాదీవెన ఉండాలని, ప్రజల సహకారం ఉంటే ఎటువంటి ఇబ్బందుల్నైనా సునాయాసంగా అధిగమించి బంగారు తెలంగాణ సాధిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

పరకాలలో చదువుకున్నా: కేటీఆర్
పరకాలతో నాకు చాలా అనుబంధం ఉంది. చిన్నప్పుడే పరకాలకు వచ్చి ఓ ఏడాది చదువుకున్నా అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పరకాల సభలో కేటీఆర్ బాల్య స్మృతులను నెమరువేసుకున్నారు. పట్టణంలో మా సమీప బంధువు ఉండేవారు. ఉద్యోగరీత్యా ఆయన పరకాలకు బదిలీపై వచ్చారు. అనూహ్యంగా నేను ఏడాదిపాటు ఇక్కడే ఉండాల్సి వచ్చింది. అప్పుడు మార్కెట్ వీధిలో గల మినర్వా పాఠశాలలో ఏడాది పాటు చదువుకున్నా. ఈ ప్రాంతంలో అనుబంధం ఏర్పడింది. ఈ ప్రాంత అభివృద్ధికోసం ఏ ప్రతిపాదన తెచ్చినా సహకారం అందిస్తా అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.