తెలంగాణ ముఖచిత్రం మారనుంది

పారదర్శకమైన పారిశ్రామిక విధానంతోపాటు హైదరాబాద్‌కు ఉన్న సానుకూల భౌగోళిక, వాతావరణ పరిస్థితులు రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం కెనడాకు చెందిన ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ వీ ప్రేమ్‌వత్స నేతృత్వంలో ప్రతినిధుల బృందం సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలుసుకుంది. ఫెయిర్‌ఫాక్స్ అనేది అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ.

KCR-met-with-FAIRFAX--representatives

-ఫెయిర్‌ఫాక్స్ కంపెనీ చైర్మన్‌తో సీఎం కేసీఆర్ భేటీ
-దేశంలో బిలియన్ డాలర్ల పెట్టుబడికి కెనడా కంపెనీ రెడీ
-సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి ప్రణాళిక
-పెట్టుబడుల అనుకూలతలపై బృందానికి వివరించిన సీఎం
భారతదేశంలో వివిధ రంగాల అభివృద్ధికి ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడిని ఆ సంస్థ పెట్టబోతున్నది. అందులో భాగంగానే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ విషయమై ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు ఈ బృందం వచ్చింది. తెలంగాణలో ఇంకా ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టవచ్చుననే విషయంలో ఫెయిర్‌ఫాక్స్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని సంప్రదించారు. దేశంలో అభివృద్ధి పథంలో ఉన్న రాష్ర్టాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం చేసే పనుల్లో పాలుపంచుకోవాలన్నది తమ ఉద్దేశమని ప్రతినిధులు సీఎంకు చెప్పారు.

ఈ సందర్భంగా వారితో మాట్లాడిన సీఎం కేసీఆర్.. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం రహదారుల అభివృద్ధి, మంచినీటి వసతుల కల్పన, విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని వివరించారు. హైదరాబాద్ నగరంలో నిర్మించనున్న స్కైవేలు, రోడ్ సపరేటర్లపై ముఖ్యమంత్రి వారికి వివరించారు. పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రం అత్యంత అనుకూలమైనదని ఆ బృందానికి సూచించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధితోపాటు ఇతర పనుల్లోనూ పాలుపంచుకుంటామని ఆ బృందం ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశంలో ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్సియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఎండీ మాధవన్‌మీనన్, డైరెక్టర్ అధప్పన్, లీ సంస్థ ఎండీ డాక్టర్ ఫణిరాజ్, సీఎస్ రాజీవ్‌శర్మ, ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.