తెలంగాణ ఈఆర్సీకి సీఎం ఆమోదం

-త్వరలో క్యాబినెట్ సమావేశంలో ప్రతిపాదన
తెలంగాణ రాష్ర్టానికి కొత్త విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (టీఈఆర్సీ) ఏర్పాటుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం మంగళవారం సంతకం చేశారు. రాష్ట్ర విభజన తదుపరి ఆరు నెలల్లోగా తెలంగాణ ఈఆర్సీ ఏర్పాటు కావాల్సి ఉంది. విద్యుత్‌రంగానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడానికి ఈఆర్సీ తప్పని సరికావడంతో సీఎం ముందుగా టీఈఆర్సీపై దృష్టి సారించారు. కొత్త టీఈఆర్సీ ఏర్పాటును క్యాబినెట్ ఆమోదించాల్సి ఉంటుంది. దీంతో త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ ఈఆర్సీ ఒక అంశంగా ఉండనుంది. తెలంగాణ ఈఆర్సీ చైర్మన్, ఇద్దరు సభ్యుల ఎంపికకు ప్రభుత్వం జాతీయస్థాయిలో నోటిఫికేషన్ ప్రకటిస్తుంది. దరఖాస్తుల పరిశీలనకు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అధ్యక్షతన ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఎంపిక కమిటీలో చైర్మన్‌తోపాటు సభ్యులుగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్రంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) చైర్మన్ ఉంటారు.

KCR 021

త్వరలో తెలంగాణకు ఆర్వోసీ ఏర్పాటు
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ పరిశ్రమల విభాగంలో సమస్యల పరిష్కారం, కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌వోసీ) కార్యాలయం, లిక్విడేటర్‌ను ఏర్పాటు చేయనుంది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించింది. రెండు రాష్ర్టాలకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఈ వ్యవస్థలను ఏర్పాటు చేస్తూ జూన్ 13న గెజిట్ నోటిఫికేషన్ వెలువరించింది. తెలంగాణలోని పారిశ్రామిక రంగంలో ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించుకునేందుకు లిక్విడేటర్ చర్యలు తీసుకుంటారు. అలాగే ప్రస్తుతం ఉన్న వ్యవస్థను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేలా ఆర్వోసీ చట్టాలను సవరిస్తుంది.