తెలంగాణ ద్రోహులను తరిమికొట్టండి

-బీజేపీ-టీడీపీలకు ఈ తలకుమాసినోడే దొరికిండా..?
-కేపీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపిద్దాం: మంత్రి కేటీఆర్
-దుబ్బాక, మిరుదొడ్డి, చేగుంటలో ఎన్నికల ప్రచారం

KTR

లోక్‌సభ ఉప ఎన్నికల్లో తెలంగాణ ద్రోహులను తరిమికొట్టాలని రాష్ట్ర పంచాయితీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మెదక్ జిల్లా ప్రజలకు పిలుపు ఇచ్చారు. యావత్ తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడుతుంటే..

తనకు తెలంగాణ వద్దు సమైక్యమే ముద్దు అని నిస్సిగ్గుగా ప్రకటించిన జగ్గారెడ్డి, తెలంగాణకు నయాపైస ఇవ్వను ఏంచేస్కుంటారో చేస్కోండని నిండు శాసనసభలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అంటే మంత్రి పదవి కోసం నోరు మూసుకున్న సునీతలక్ష్మారెడ్డి లాంటి తెలంగాణ ద్రోహులను ఎన్నికల్లో డిపాజిట్ దక్కకుండా చేయాలని అన్నారు. మెదక్ పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కేటీఆర్ దుబ్బాకలో రోడ్‌షో, మిరుదొడ్డి, చేగుంటల్లో ఇంటింటి ప్రచా రం నిర్వహించారు. ఆనంతరం ఆయా గ్రామాల్లో జరిగిన బహిరంగసభల్లో ఆయన మాట్లాడుతూ బానిస మనస్తత్వం వదలని టీడీపీ, బీజేపీ నేతలు మాత్రం ఆంధ్రోళ్ల మోచేతి నీళ్లు తాగుతూ తెలంగాణకు వ్యతిరేకంగా అవాకులు చెవాకులు పేలుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

బీజేపోల్లు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు లేక లేక ఈ తలకుమాసినోడే దొరికిండా..? అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీలో క్రమ శిక్షణ గల సమర్థులైన కార్యకర్తలెవరూ దిక్కు లేరా..? అని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్తప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి మెదక్ జిల్లా ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా అందివ్వాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. దుబ్బాక నియోజకవర్గానికి సిరిసిల్ల తరహా ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తున్నదని మంత్రి చెప్పారు. వృద్ధులకు, వితంతువులకు దీపావళి తర్వాత రూ.వెయ్యి చొప్పున, వికలాంగులకు రూ.1500 చొప్పున పెన్షన్ ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

టీఆర్‌ఎస్‌కే మా మద్దతు: యాదవ విద్యార్థి సంఘం
ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థికే తమ మద్దతు ఉంటుందని యాదవ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ యాదవ్ పిలుపునిచ్చారు.