తెలంగాణ చరిత్రను వెలుగులోకి తెస్తాం

-భారత రాజ్యాంగం-రాజకీయ వ్యవస్థ పుస్తకావిష్కరణలో మంత్రి జగదీశ్‌రెడ్డి
తెలంగాణ చరిత్ర, సంస్కృతిని వెలుగులోకి తీసుకొచ్చి.. ప్రామాణిక చరిత్ర గ్రంథాలను వెలువరిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెలిపారు. సుంకర రమాదేవి రచించిన భారత రాజ్యాంగం-రాజకీయ వ్యవస్థ అనే పుస్తకాన్ని మంత్రి ఆదివారం చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయంలో ఆవిష్కరించి.. ప్రసంగించారు.
రాష్ట్రంలో ప్రాథమిక స్థాయిలో పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రవేశపెడతామని, ఉన్నత విద్య పాఠ్యపుస్తకాల్లోనూ తెలంగాణ చరిత్రకు ప్రాధాన్యముంటుందని తెలిపారు. రమాదేవి రచించిన ఈ పుస్తకం తెలంగాణ నిరుద్యోగులకు కానుక అని పేర్కొన్నారు. నిరుద్యోగులు, ప్రజల ఆశలను త్వరలోనే నెరవేరుస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రింబవళ్ళు తెలంగాణ అభివృద్ధికి కృషిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణను వెంటాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

jagadishreddy

కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ తెలుగులో రాజ్యాంగాన్ని అనువాదం చేయించి ప్రామాణిక గ్రంథాలను ప్రజాప్రతినిధులందరికీ అందజేయాలని కోరగా.. పరిశీలిస్తామని మంత్రి చెప్పారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓయూ ప్రొఫెసర్ ముత్తయ్య, సికింద్రాబాద్ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ గోపాల్‌రెడ్డి, ఐఏఎస్ వీ నాగిరెడ్డి, భానుప్రసాద్, వెంకటరమణ, నాళేశ్వరం శంకరం పాల్గొన్నారు. గ్రంథాలయ ఉద్యోగులు తమకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని మంత్రికి వినతిపత్రం ఇచ్చారు.