తెలంగాణ అరాచకవాదుల కోసం కాదు

సూర్యాపేట గూండాలకు నిలయంగా మారింది: ఈటెల రాజేందర్
సూర్యాపేట: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో 14 ఏళ్లపాటు ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చింది గూండాలు, అరాచకవాదుల కోసం కాదని, 85 శాతంగా ఉన్న బడుగు, బలహీన వర్గాల కోసం మాత్రమేనని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో టీఆర్‌ఎస్ మున్సిపల్ అభ్యర్థుల గెలుపు కోసం ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నేతత్వంలో పలు వార్డుల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడారు. ఒకప్పుడు సూర్యాపేట ఉద్యమాలకు ఖిల్లా అని, నేడు స్థానిక పాలకుల గూండాగిరికి నిలయంగా మారిందని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులను, వారి కోసం ప్రచారం చేసే వారిని బెదిరింపులకు గురిచేస్తున్నట్లు తన దష్టికి వచ్చిందని, ఖబడ్దార్ తాము తలుచుకుంటే ఆనవాళ్లు లేకుండా పోతారని హెచ్చరించారు.

తెలంగాణ కోసం రోడ్లపై పడుకొని, లాఠీ దెబ్బలు తిని, జైళ్లకు వెళ్లిన చరిత్ర టీఆర్‌ఎస్‌కు ఉందని, అలాంటి వారితో పెట్టుకుంటే మాడిమసై పోవడం ఖాయమన్నారు. ఇన్ని ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చింది గూండాలు, స్వార్థ రాజకీయ నేతలు, భూకబ్జాదారుల కోసం కాదని, ఆకలి, దప్పిక, మన దుఃఖాన్ని దూరం చేసుకునేందుకేనని చెప్పారు. ఏనాడూ తెలంగాణ కోసం ఉద్యమం చేయని పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని, అలాంటి వాటిని ఓటుతో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

జనగామలో ఈటెల రిమాండ్.. విడుదల
జనగామ: వరంగల్ జిల్లా జనగామ మండలం పెంబర్తి చెక్‌పోస్టు వద్ద ఈనెల 11న విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించారనే విషయమై ఈటెల రాజేందర్‌పై జనగామ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో బుధవారం ఆయన లొంగిపోయారు. సీనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపర్చగా, బెయిల్ మంజూరైంది.