టీబీ దవాఖానను సందర్శించిన సీఎం

-అభివృద్ధి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్
-ఖాళీ స్థలాలపై ఆరా..
-సీఎం వెంట మంత్రులు హరీశ్‌రావు, పోచారం, తుమ్మల

KCR-05

వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఛాతీవ్యాధుల (టీబీ) దవాఖానాను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులతో కలిసి దవాఖానా పరిసరాలను పరిశీలించారు. ఛాతీవ్యాధుల దవాఖాన ఎంత విస్తీర్ణంలో ఉంది..? ఎన్ని ఎకరాల ఖాళీస్థలం ఉంది..? అనే విషయాలను అధికారులతో చర్చించారు. దవాఖానాకు పక్కనే ఉన్న ఆయుర్వేద దవాఖాన, రోడ్డుకు అవతల ఉన్న మానసిక రోగుల చికిత్సాలయం ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలంపై సీఎం చర్చించారు. ఈ సందర్భంగా దవాఖానా వైద్యుడు డాక్టర్ ఖాన్ తదితరులు సీఎంకు దవాఖానా పరిసరాలు తదితర వివరాలు తెలియజేశారు. ఆ ఖాళీ స్థలంలో ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి నిర్మాణాల నేపథ్యంలో స్థలాలను సీఎం స్వయంగా పరిశీలించారని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. సీఎం వెంట మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, అధికారులు రాజీవ్‌శర్మ, ఛాతీవ్యాధుల దవాఖాన రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ (ఆర్‌ఎంఓ) డాక్టర్ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.