టాటా భాగస్వామ్యం దిశగా..!

-నేడు ముంబైకి మంత్రి కేటీఆర్
– రాష్ట్రంలో మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు యత్నం
– తెలంగాణ పారిశ్రామిక పాలసీని వివరించే అవకాశం
– టీ- హబ్‌లో టాటాల భాగస్వామ్యాన్ని కోరే అవకాశం
– టాటాకు మౌలిక రంగ పెట్టుబడుల అవకాశాలపై చర్చ

KTR with Infosys  Narayanamurthi

రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారించిన సర్కార్.. ఆ దిశగా మరో అడుగు ముందుకు వేస్తున్నది. పారిశ్రామిక రంగంలో వివిధ కార్పొరేట్ సంస్థలను ప్రత్యేకించి టాటా గ్రూప్ సంస్థలను భాగస్వాములను చేయాలని సంకల్పించింది. అందులో భాగంగా పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ఒకరోజు పర్యటన నిమిత్తం మంగళవారం ముంబై వెళ్లనున్నారు. టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీ సహా ఎనిమిది గ్రూప్ అనుబంధ సంస్థల సీఈవోలతో సమావేశం కానున్నారు.
ఈ సమావేశం గతంలో ఒకటి రెండుసార్లు ఖరారైనా వివిధ కారణాలతో వాయిదాపడింది. సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ముంబై వెళుతున్న మంత్రి కేటీఆర్.. పరిశోధనల కోసం రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న టీ హబ్‌లో భాగస్వాములు కావాలని టాటా గ్రూప్ సంస్థలను కోరనున్నారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ ఆండ్ నాలెడ్జ్ (టాస్క్) వంటి కార్యక్రమాల్లోనూ పాలుపంచుకోవాలని ఆయన కోరే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఒక మ్యానుఫాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేయాలని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీని మంత్రి కేటీఆర్ కోరనున్నారు. మిస్త్రీతోపాటు ఇతర టాటా సంస్థల సీఈఓలతో సమావేశమై వివిధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, రంగాల వారీగా తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను ఆయన వివరిస్తారు.

ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం, అందులో ఆకర్షణీయ అంశాలను వివరిస్తారు. రాష్ట్ర ఐటీ శాఖ చేపట్టిన పలు కార్యక్రమాలను టాటా గ్రూప్ సంస్థలకు తెలియజేస్త్తారు. టాటాగ్రూప్ ఆధ్వర్యంలోని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధులను తెలంగాణలో ఖర్చు చేయాలని మంత్రి కేటీఆర్ ప్రతిపాదించనున్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి భారీ పెట్టుబడి టాటా గ్రూప్‌దేనని గుర్తుచేస్తూ గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రతన్‌టాటా సమావేశమైనప్పుడు చేసిన పలు ప్రతిపాదనలను ప్రభుత్వం తరఫున వివరించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన పేదలకు డబుల్ బెడ్‌రూం గృహా పథకంలో టాటా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చౌక ఇంటి పథకంలోని పలు ప్రతిపాదనలపై చర్చిస్తారు.

ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని కలిసిన కేటీఆర్
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణమూర్తిని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు సోమవారం శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వెంట నాస్కామ్ చైర్మన్, టీ హబ్ డైరెక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, రాష్ట్ర ఐటీశాఖ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్ ఉన్నారు.

ఇదీ మంత్రి కేటీఆర్ ముంబై పర్యటన షెడ్యూల్
– ఉదయం 11 గంటలకు ముంబైకి చేరిక.

– మధ్యాహ్నం రెండు గంటలకు ముంబై హౌస్‌కు చేరిక.

– 2.00- 2.25 గంటల మధ్య టాటా రియాల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎండీ సంజయ్ ఉబాలేతో సమావేశం.

– 2.25-2.45 గంటల మధ్య టాటా క్యాపిటల్ ప్రతినిధులతో భేటీ.

– 2.45-3 గంటల మధ్య టాటామోటార్స్, సీవీబీయూల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి పిశరోడితో భేటీ.
– 3.00- 3.30 గంటల మధ్య టాటా టెలీకమ్యూనికేషన్స్ ప్రతినిధులతో సమావేశం.

– 3.30 -4 గంటల మధ్య టీసీఎస్ ప్రతినిధులతో భేటీ కానున్న కేటీఆర్.

– 4.00 -4.30 గంటల మధ్య టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఎండీ సుక్రాన్ సింగ్‌తో సమావేశం.

– సాయంత్రం 4.30 – 5.00 గంటల మధ్య టాటా పవర్ ఎండీ అనిల్ సర్దానాతో భేటీ.

– 5.00 – 6.30 గంటల మధ్య టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ సైరస్‌మిస్త్రీతో సమావేశం.