టీ-హబ్‌కు నేడు శంకుస్థాపన

-స్టార్టప్ నగరంగా హైదరాబాద్
-వినూత్న ఆవిష్కరణలకు అవకాశం
-పదివేల కంపెనీల ఏర్పాటే లక్ష్యం
-ఐటీ మంత్రి కే తారకరామారావు

KTR 001

రాష్ట్రంలో ఐటీ రంగంలో పరిశోధనలు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టీ-హబ్ ఏర్పాటుకు శుక్రవారం రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కే తారకరామారావు శంకుస్థాపన చేయనున్నారు. రెండు దశల్లో అభివృద్ధి చేసే టీ-హబ్ కోసం రూ. 235 కోట్లు ఖర్చు చేయనున్నారు. 3.60లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచస్థాయి సౌకర్యాలు, ప్రమాణాలున్న దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌ను రూపొందించడానికి శుక్రవారం ఉదయం 11గంటలకు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో మంత్రి భూమిపూజ నిర్వహించనున్నారు. టీ-హబ్ ఏర్పాటుతో హైదరాబాద్ ఇక దేశంలోనే టెక్నాలజీ స్టార్టప్ నగరంగా నిలిచే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో టీ-హబ్ ఏర్పాట్ల గురించి మీడియాకు వివరించారు. టీ-హబ్ ఏర్పాటుతో హైదరాబాద్ ఐటీ రంగంలో అత్యుత్తమ పరిశోధనలకు కేంద్రం కాబోతున్నదని చెప్పారు. వినూత్న ఆలోచనలున్న యువతకి ఉద్యోగం మాత్రమే కాకుండా కంపెనీలను సృష్టించేలా మేనేజ్‌మెంట్ పరమైన నైపుణ్యాలను అందించనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. వచ్చే ఐదేండ్లలో టీ-హబ్ ద్వారా విజయవంతమైన 1000 స్టార్టప్ కంపెనీలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 25 అత్యుత్తమ ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వీటి ద్వారా 10వేల ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. టీ-హబ్‌లోభాగంగా ఐడియా దశలో (లాంచ్ పాడ్) ప్రాథమిక పరిశోధనలో (యాక్సలేటర్ కంపెనీలు), కంపెనీ నుంచి మార్కెటింగ్ దశకి(ప్రొపెల్లర్) దశల్లో ఉండే స్టార్టప్‌కు ప్రభుత్వం సహకారం అందించనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే ఐఎస్‌బీ, ట్రిపుల్ ఐటీ, నల్సార్‌వంటి సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. టీ-హబ్ కోసం రూ.10కోట్ల ప్రాథమిక మూలధనంతో ఒక కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ కంపెనీలో సైయంట్ చైర్మన్ బీవీ మోహన్‌రెడ్డి, శ్రీ కాపిటల్ ఫౌండర్ శశిరెడ్డి, కేకేఆర్ ప్రిస్మా సంస్థ చైర్మన్ గిరీష్‌రెడ్డి, టెక్ మహీంద్ర సీఈవో సీపీరెడ్డి డైరెక్టర్లుగా ఉండేందుకు అంగీకరించినట్లు చెప్పారు. కార్యక్రమానికి కేటీఆర్‌తోపాటు భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రోడ్డు-రవాణా శాఖ మంత్రి పీ మహేందర్ రెడ్డి, టీ-హబ్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ బీవీ మోహన్‌రెడ్డి, ఐఐఐటీ ప్రతినిధి పీజే నారాయణ్, ఐఎస్‌బీ డీన్ అజిత్ రంగ్నేకర్, నల్సార్ వీసీ ప్రొఫెసర్ పైజాన్ ముస్తాఫా పలువురు ప్రతినిధులు పాల్గొననున్నారు.