సైనికుల్లా పనిచేయాలి

-టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదులో శ్రేణులకు నేతల పిలుపు

ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేసి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా చూడటంతోపాటు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. గురువారం కరీంనగర్ జిల్లా వీణవంక, ఇల్లందకుంట, హుజూరాబాద్‌లలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రతి కుటుంబంలో కనీసం రెండు సభ్యత్వాలు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేయాల్సిన బాధ్యత కూడా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలపై ఉన్నదన్నారు. కక్షపూరిత రాజకీయాలు టీఆర్‌ఎస్‌లో ఉండవన్నారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందజేస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. పార్టీని నమ్ముకున్నోళ్లకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే బీమా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో సభ్యత్వం తీసుకొని దురదృష్టవశాత్తూ మృతి చెందినవారి కుటుంబాలకు రూ.2 లక్షల బీమా చెక్కును అందించామన్నారు. ఆదిలాబాద్‌లో అటవీశాఖ మంత్రి జోగు రామన్న సభ్యత్వాలు అందజేశారు. హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, సైదాబాద్‌లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, వికారాబాద్ జిల్లా యాలాలలో రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగులో మంత్రి చందూలాల్ సభ్యత్వాలు అందజేశారు. సూర్యాపేట జిల్లాలో ఉద్యమాన్ని తలపించేలా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతున్నదని విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖల మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.

జిల్లా కేంద్రంలో పలువురికి సభ్యత్వాలు అందజేశారు. పార్టీలకతీతంగా అన్నివర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా కొనసాగుతున్న పాలనకు ప్రజలంతా అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారన్నారు. వరంగల్ హంటర్‌రోడ్‌లోని తన నివాసంలో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు.. ఎస్‌ఆర్ విద్యాసంస్థల అధినేత వరదారెడ్డికి సభ్యత్వాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వొడితెల సతీశ్, టీఆర్‌ఎస్వీ సెక్రటరీ జనరల్ వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శివాజీనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, జగిత్యాలలో శాసన మండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మక్తల్ పట్టణంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పలువురికి సభ్యత్వాలు అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని వికలాంగుల కాలనీలో ఎమ్మెల్యే జలగం వెంకటరావు సభ్యత్వాలను అందజేశారు.