స్వైన్‌ప్లూ పై భయం వద్దు

-అందుబాటులో చికిత్స , తగినన్ని మందులు
-ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి: హరీశ్‌రావు

Harishrao-Review-meet-on-Swineflu-in-Sangareddy

స్వైన్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చికిత్స, మందులు అందుబాటులో ఉన్నాయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. శుక్రవారం మెదక్ జిల్లాలోని సిద్దిపేట, సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలను మంత్రి సందర్శించి తనిఖీలు నిర్వహించారు. వార్డుల్లో పర్యటించి రోగులకు వైద్యం అందుతున్నదా? డాక్టర్లు సమయానికి వస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. తర్వాత సంగారెడ్డిలో కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వైన్‌ఫ్లూను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చామని, చికిత్స అందదని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.

అన్ని ప్రభుత్వ దవాఖానల్లో మందులను అందుబాటులో ఉంచామన్నారు. స్వైన్‌ఫ్లూపై ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ మాట్లాడారని, అవసరమైతే కేంద్రం నుంచి సేవలు అందిస్తామన్నారు. చలితీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువని, మరో పదిహేను రోజులైతే చలి తగ్గిపోతుందని.. స్వైన్‌ఫ్లూ విజృంభణ కూడా అంతమవుతుందన్నారు. అప్పటివరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందు జాగ్రత్తచర్యలు తీసుకుంటే భయపడాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రతి దవాఖానలో వైద్యపరీక్షల కోసం ప్రత్యేకవార్డులను ఏర్పాటు చేశామన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారికి అక్కడ ప్రథమ చికిత్స చేస్తారని, నయంకాకపోతే ప్రభుత్వ ఖర్చులతోనే హైదరాబాద్‌లోని దవాఖానల్లో చికి త్స అందిస్తామన్నారు. మెదక్ జిల్లాలో స్వైన్‌ఫ్లూ ప్రభావం ఎక్కువగా లేదని, వ్యాధి నియంత్రణకు జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని అభినందించారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, కలెక్టర్ రాహుల్ బొజ్జా, డీఆర్వో దయానంద్, మురళీయాదవ్ అధికారులు పాల్గొన్నారు.