స్వర్ణతెలంగాణకు నాంది

-రాష్ర్టాభివృద్ధిలో భాగస్వాములు కండి
-పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు
-17 కంపెనీలకు అనుమతి పత్రాలు అందించిన సీఎం
-యువతకు ఉపాధి, రాష్ట్ర ఆర్థిక పటిష్ఠతే లక్ష్యమన్న కేసీఆర్
-పరిశ్రమలు పోతాయన్నవారికిదే సమాధానం: జూపల్లి

KCR handover TS Ipass approval to Industrialists

తెలంగాణ పారిశ్రామిక స్వర్ణయుగానికి నాంది ప్రస్తావన జరిగింది. పారిశ్రామిక విధానం ప్రకటించిన తర్వాత మొదటిసారి 17 పరిశ్రమలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం సచివాలయంలో అనుమతి పత్రాలు అందించారు. రాష్ట్రం పారిశ్రామిక స్వర్ణయుగం వైపు పురోగమనం ప్రారంభించిందని, అందుకు ఈ కార్యక్రమంతో నాంది పలుకుతున్నామని ముఖ్యమంత్రి ఆనందోత్సాహల మధ్య ప్రకటించారు. యువకులకు ఉపాధి అవకాశాలు పెంపొందించడంతో పాటు రాష్ర్టాన్ని ఆర్థికంగా పటిష్ఠపరిచే లక్ష్యంతో సింగిల్ విండో పారిశ్రామిక విధానం తెచ్చామని కేసీఆర్ చెప్పారు. ఇక్కడ పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉన్నదని, ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నదని ఆయన పునరుద్ఘాటించారు. పరిశ్రమలకు కావాల్సిన భూమి, నీరు, కరెంట్ వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తూ, అనుమతులను కూడా సరళతరం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈ సానుకూలతలను ఉపయోగించుకుని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన కంపెనీలను అభినందించారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పరిశ్రమల విభాగ అధికారులు చాలా వేగంగా పనిచేశారని వారిని అభినందించారు. కంపెనీల ప్రతినిధులు తమ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి అనుమతులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చేతుల మీదుగా అనుమతుల పత్రాలు అందుకున్న వారిలో ఐటీసీ డైరెక్టర్ చిత్తరంజన్‌దర్, ఐటీసీ తెలంగాణ హెడ్ సంజయ్‌సింగ్, న్యూజెన్ ఇండస్ట్రీస్ ఎండీ బి.రవీంద్రనాథ్, అంజనీ పోర్ట్ ల్యాండ్ సిమెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్.వెంకటరాజు, ఎంఎస్‌ఎన్‌లైఫ్ సైన్సెస్ ఎండీ ఎన్.రెడ్డి, స్నేహ ఫామ్స్ ఎండీ డి. రామిరెడ్డి, ఐజంట్ డ్రగ్స్ రీసెర్చ్ సొల్యుషన్స్ ప్రతినిధి, పయనీర్ టూర్ స్టీల్ మిల్స్ సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్ రాజరతన్, సొలిత్రో సీఈఓ టీఎస్.ప్రసాద్, కోవాలెంట్ ల్యాబరేటరీస్ ప్రతినిధి, ఇపిఆర్ సెంటర్ ఫర్ క్యాన్సర్ రీసర్చ్ డైరెక్టర్ అంబుల్గే, భావన సోలార్ డైరెక్టర్ వివి.రావు, ప్రీమియర్ ఫొటో వాల్‌టేక్ సీఈఓ కార్తీక్ పొల్సాని, ఉష వెంచర్స్ జీఎం హరిబాబు, వాల్యు ల్యాబ్స్ ఎండీ క్రిష్ణా రెడ్డి, దొడ్ల డెయిరీ ఎండీ సునిల్ రెడ్డి, హెచ్‌ఐఎల్ లిమిటెడ్ జీఎం రమణ, డ్యురలైన్ లిమిటెడ్ యూనిట్ హెడ్ రాహూల్ వెంకట్ ఉన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కే తారకరామారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, వినయ్‌భాస్కర్, జీవన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, చేజింగ్ సెల్ సీఈఓ శాంతికుమారి, టీఎస్‌ఐఐసీ ఎండీ. ఈవీ నర్సింహారెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్‌రాజ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇది ఆరంభమే: మంత్రి జూపల్లి
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటునకు ఇది ఆరంభం మాత్రమేనని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కంపెనీల ప్రతినిధులకు ముఖ్యమంత్రి అనుమతిపత్రాలు అందించిన అనంతరం సచివాలయంలో జూపల్లి విలేకరులతో మాట్లాడారు. రాష్ర్టానికి అనేక జాతీయ అంతర్జాతీయస్థాయి పరిశ్రమలు తెలంగాణకు రాబోతున్నాయని తెలిపారు. ప్రధానంగా ఇంజినీరింగ్, ఏరోస్పేస్, ఆగ్రో, ఐటీ, విద్యుత్ తదితర 14 రంగాల్లో పరిశ్రమలు వస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలతో తీసుకువచ్చిన టీఎస్ ఐపాస్ విధానం దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రశంసలు అందుకుంటున్నదన్నారు. దరఖాస్తు చేసుకున్న పదిహేను రోజుల్లో అనుమతులిస్తామని టీఎస్ ఐపాస్ ఆవిష్కరణ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించినా అంతకన్నా ముందే ఇచ్చామన్నారు. పరిశ్రమల శాఖ, పొల్యుషన్ కంట్రోల్‌బోర్డు, హెచ్‌ఎండీఏ, విద్యుత్ శాఖ సహా మొత్తం15 డిపార్ట్‌మెంట్ల అనుమతులు కంపెనీల ప్రతినిధులకు అందించామని ఆయన వివరించారు.

పారిశ్రామిక వేత్తల్లో హర్షం..
టీఎస్ ఐపాస్ విధానం, ముఖ్యమంత్రి నేరుగా అనుమతి పత్రాలు అందించడంపై పారిశ్రామికవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని జూపల్లి తెలిపారు. పారిశ్రామిక రంగంలో మేం గడచిన 20 నుంచి 30 ఏళ్లుగా ఉన్నాం. ఇప్పటిదాకా ఏ రోజూ, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ పద్ధతిల్లో మాకు అనుమతులివ్వలేదు. ఒక్క పొల్యుషన్ కంట్రోల్‌బోర్డు నుంచి అనుమతులు రావాలంటేనే ఆరు నెలలు పట్టేది, విద్యుత్‌శాఖ నుంచీ అనుమతులకు నెలల తరబడి టైం పట్టేది. కానీ ఈ రోజు మేం ఏ డిపార్ట్‌మెంట్‌కి పోకుండానే మమ్మల్నే పిలిపించి అనుమతులివ్వడం సంతోషంగా ఉంది అని వారు చెప్పారని మంత్రి వివరించారు.

List

 

పరిశ్రమలు పారిపోతాయన్నారు..
ఉద్యమ సమయంలో కొందరు తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు ఉండదు, పరిశ్రమలు తరలిపోతాయని చేసిన ప్రచారానికి కేసీఆర్ దీటైన సమాధానం చెప్పారని జూపల్లి చెప్పారు. ఇవాళ పెద్ద ఎత్తున పరిశ్రమలు తెలంగాణకు తరలి వస్తున్నాయన్నారు. పరిశ్రమల్లో వాడే పెద్ద ట్రాన్స్‌ఫార్మర్లకు ఆర్డర్లు భారీగా పెరిగాయని పారిశ్రామిక వేత్తలు చెప్పడం రాష్ట్రంలో పరిశ్రమల ఉధృతిని తెలుపుతున్నదన్నారు. సిర్పూర్‌కాగజ్‌నగర్‌లో మూతపడిన పరిశ్రమను తిరిగి తెరిపిచేందుకు పెట్టుబడుదారులు ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, ప్రభుత్వం చొరవ చేస్తున్నదని ఆయన చెప్పారు.

List 02