స్వచ్ఛత కోసం కలిసి సాగుదాం

ప్రజలకు స్వచ్ఛ హైదరాబాద్ పట్ల అవగాహన కల్పించడం కోసం తెలంగాణ సాంస్కృతిక శాఖ కూడా నడుం బిగించింది. ఇప్పటికే సాంస్కృతిక సారథి కళాకారులు, రచయితలు ఎన్నో పాటలను తయారు చేసుకున్నారు. సగటు నగర పౌరునికి స్వచ్ఛ హైదరాబాద్ ఆవశ్యకతను తెలియజేసేలా కార్యోన్ముఖులవుతున్నారు.

ఒకప్పటి మంచినీటి మూసీనది ఒడ్డున తలెత్తుకున్న నగరం మన హైదరాబాద్. శతాబ్దాల చరిత్ర ఈ నగరం సొంతం. యావత్ ప్రపంచమే తలతిప్పి చూసే చరిత్ర ఈ నగరం సొం తం. రాజ వంశీయుల పాలన నుంచి నేటి వరకు హైదరాబాద్‌ది సాటిలేని చరిత్ర. క్రీ.శ.1వ శతాబ్దంలోనే గోల్కొండ కేంద్రంగా పరిపాలన కొనసాగింది. నాడు ముత్యాలు, రత్నాలు రాశులు పోసి అమ్మేవారని ఇప్పటికీ చెప్పుకుంటారు. అందుకేనేమో ఈ నగరానికి ముత్యాల నగరమని పేరొచ్చింది. అంతే కాదు హైదరాబాద్ నగారానికి సిటీ ఆఫ్ లేక్స్ అనే పేరు కూడా ఉంది. లెక్కలేనన్ని చెరువులు తవ్వి, ప్రజలకు తాగు, సాగునీరు అందుబాటులో ఉంచారు కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు.

అట్లా ఈ నగరంలో ఏ మంచి పని చేసినా అది ప్రజలకు ఉపయోగపడేలా పాలించారు. ప్రేమ పునాదుల మీద నిర్మించాడు కులీకుతుబ్‌షా ఈ నగరాన్ని నిర్మించాడు. ఆ రోజుల్లోనే ఆయన నమాజు ప్రార్థనలో ఓ విషయాన్ని ప్రవక్తకు మొర పెట్టుకునేవాడట. చెరువును చేపలతో నింపినట్టు, ప్రభువా ఈ నగరాన్ని ప్రజలతో నింపమని కోరేవాడట. ఆయన ప్రార్థన అల్లా ఆలకించినట్టే ఇవాళ లక్షలాది జనంతో హైదరాబాద్ నిండింది. ఆ తరువాత పాలించిన నిజాం రాజులు ఈ నగరాన్ని మరింత అభివృద్ధి చేశారు. అనేక చారిత్రక కట్టడాలు నిర్మించి, ప్రజోపయోగ కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. అట్లా ఈ నగరాన్ని ప్రపంచమే తలతిప్పి చూసేలా తీర్చిదిద్దారు. దేశంలోనే హైదరాబాద్ నెంబర్ వన్ నగరంగా నిలిపింది నిజాం పాలన. సొంత కరెన్సీ, సొంత రవాణా సదుపాయాలైన రైల్వే వ్యవస్థ, రోడ్డు రవాణా సంస్థ, ఆఖరికి విమానయాన సర్వీసులను కూడా ఆనాడే ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా ఇప్పుడున్న హుస్సేన్‌సాగర్ ఒడ్డున విద్యుత్ సరఫరా కేంద్రాలను నిర్మించారు.

అలా ఆంధ్రా కంటే వందేళ్ల ముందే ఇక్కడ కరెంటు వెలుగులు వెలిశాయి. అంతేకాదు ప్రజల ఆరోగ్యాల కోసం నిజాం ప్రభువుల్లో అత్యంత ఎక్కువ శ్రద్ధ కనిపించేది. ఇందుకు నిదర్శనమే ఇప్పుడున్న ఉస్మానియా, బొక్కల దవాఖాన, నిమ్స్, నిలోఫర్ దవాఖానాలు. వీటి నిర్మాణానికి సరైన ప్రభుత్వ స్థలాలు లేకుంటే, తమ సొంత భూములను సైతం ప్రజల కోసం ధారాదత్తం చేసిన త్యాగశీలురు నిజాం ప్రభువులు. ఇట్లా ఒక్క రంగమని కాదు విద్య, వైద్యం, రవాణా, విద్యుత్తు వంటి వాటిలో ముందంజలో ఉన్నది మన ఆత్మగల్ల నగరం.

ఇక ఇక్కడి ప్రజల సహజీవన సామరస్యం కూడా అద్భుతమైంది. రకరకాల మతాలు, కులాలు, ఆచార వ్యవహారాలు కలగలిసి ఒక ఇంధ్రధనస్సును తలపిస్తాయి. అట్లా హైదరాబాద్ అంటే గంగా జమున తహెజీబ్ అనే మాట యాదికొస్తది. ఏ మతమైనా, సోదర మతస్తులతో కలిసిమెలిసి జీవించే తీరు ఇక్కడ సజీవంగా ఉంది. ప్రేమ పునాదుల మీద నిర్మించిన నగరం అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం మన భాగ్యనగరమే. ఇక్కడ ఎన్ని భాషలు మాట్లాడుతున్నా సరే, హైదరాబాద్ అంటే ఒక జీవభాషలాగా వినిపిస్తది. అతి తక్కువ ఖర్చుతో పదిలంగా జీవించడానికి అనేక అవకాశాలున్నాయి. అందుకే నగరంలో జనాభా క్రమంగా పెరిగిపోయింది. ఇక వాతావరణం సంగతైతే చెప్పాల్సిన పనిలేదు. ఒక్కోరోజు ఒక్కో రకంగా మన మనసుల్ని దోచుకుంటది. నిండు ఎండాకాలం కూడా చల్లదనాన్ని ప్రసాదించి, మన శరీరాలే కాదు మనసుల్ని తేలిక పరుస్తది. అంతటి గొప్పనగరం మన హైదరబాద్.

వందల యేళ్ల చరిత్ర కలిగిన నగరం సమైక్య పాలనలో తన అస్తిత్వాన్ని కోల్పోయింది. పైపై మెరుగులను చూపిస్తూ, హైదరాబాద్ ఆత్మను పీడించే రాక్షస పాలన ఈ అరవయేళ్ల కాలంలో కొనసాగింది. అన్నీ మేమే అభివృద్ధి చేశామని డబ్బా కొట్టుకునే పాలకులకు చరిత్ర తెలియదు. తెలిసినా, దాన్ని ఎక్కడ కనపడకుండా, వినపడకుండా జాగ్రత్త పడ్డారు. స్వయం ప్రకాశక దశ నుంచి వేరొకరి మీద ఆధారపడే బానిసను చేశారు. ముఖ్యంగా సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగింది. ఇక్కడున్న లక్ష చెరువుల అడ్రస్సు గల్లంతు చేశారు. మంచినీళ్లు అందించిన మూసీనదిని మురికి కూపంగా మార్చారు. శివారు భూములన్ని బుక్కపెట్టి, నగరాన్ని పట్టి పీడించారు. ఇవ్వన్నీ గతపాలకుల అండదండలతోనే జరిగాయన్నది బహిరంగ రహస్యం. ఒక్క మూసీనదే కాదు, హైదరాబాద్, సికిందరాబాద్ జంటనగరాల ప్రజల దాహార్తిని తీర్చిన హుస్సేన్ సాగరాన్ని కంపు కాసారంగా మార్చేశారు. శతాబ్దాల చరిత్ర పూర్తిగా ధ్వంసమైపోయింది సమైక్య పాలనలోనే. ఈ బండారాన్ని బట్టబయలు చేసింది తెలంగాణ ఉద్యమం. 1956 కు ముందు ఉన్న ప్రజల జీవితం, ఆ తరువాత సమస్యలమయంగా మారిన తీరును కుల్లకుల్లం విడమరిచి చెప్పింది.

నేడు హైదరాబాద్‌లో ఏ బస్తీకి పోయినా, సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. రోడ్లు, డ్రైనేజీ వంటివి పేద ప్రజలకు దినదినగండంగా మారాయి. ఈ దుస్థితి చూసి సీఎం కేసీఆర్ చలించిపోయారు. తెలంగాణ స్వయంపాలన సిద్ధించగానే నగర పునర్నిర్మాణానికి పిలుపునిచ్చారు. కాలనీల్లో తిష్టవేసిన దశాబ్దాల సమస్యలకు చరమగీతం పాడాలని ఆదేశించారు. దీంతో ఇవాళ హైదరాబాద్ నగరం మరోసారి తన గత వైభవాన్ని సంతరించుకోవడానికి సిద్ధమవుతున్నది.

ప్రజల భాగస్వామ్యంతో నగర సమస్యలను పరిష్కరించడానికి సీఎం స్వచ్ఛ హైదరాబాద్ పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేశారు. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ తదితర శాఖల అధికారుల సమన్వయంతో పాటు పెద్ద మొత్తంలో ప్రజా ప్రతినిధులను ఇందులో భాగస్వాములను చేస్తున్నారు. నగరం మెడలో ఉన్న బస్తీల, కాలనీల హారాలను బాగుచేసే పనికి పూనుకున్నారు. స్వచ్ఛ్ హైదరాబాద్ అంటే స్వచ్ఛ్ భారత్‌లాగా కేవలం ఫొటోలకు ఫోజులిచ్చి చీపుర్లు పట్టుకోని చేతులు దులుపుకోవడం కాదు. సమస్యేంటి, దాని పరిష్కారానికి మూలా లు ఎక్కడున్నాయి. ఎన్ని నిధులతో ఆ సమస్య పరిష్కారమవుతుందనేది తక్షణం తేల్చాలన్నారు సీఎం. ఇది చిత్తశుద్ధి కలిగిన ప్రజా పాలన. అందుకే నగరాన్ని 425 యూనిట్లుగా విభజించారు.

ఈ నెల 17 నుంచి 20 వరకు హైదరాబాద్ నగరంలో స్వచ్ఛ్ హైదరాబాద్ కార్యక్రమం కొనసాగనుంది. సమస్యల పరిష్కారానికి ఒక్కో యూనిట్‌కు 50 లక్షల రూపాయాల్ని కూడా కేటాయించారు. ఇట్లా హైదరాబాద్‌ని పూర్తిగా సరికొత్తగా ఆవిష్కరించడానికి సీఎం కేసీఆర్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఇక ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో మరోసారి అంకితం కావాలి. హైదరాబాద్‌ను బాగు చేసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలి. అప్పుడే హైదరాబాద్ బాగవుతుంది. తమతమ బస్తీల్లో, కాలనీల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇంతకు మించిన సదవకాశం మరొకటి లేదు. పచ్చదనం పరిశుభ్రత అనే విషయాల పట్ల ప్రజలు తమ అవగాహనను పెంచుకోవాలి. కాలుష్య కాసారంగా మారిన దశ నుంచి హరిత హైదరాబాద్ దశకు చేరుకోవాలి.

ప్రజలకు స్వచ్ఛ హైదరాబాద్ పట్ల అవగాహన కల్పించడం కోసం తెలంగాణ సాంస్కృతిక శాఖ కూడా నడుం బిగించింది. ఇప్పటికే సాంస్కృతిక సారథి కళాకారులు, రచయితలు పాటలు తయారు చేసుకున్నారు. సగటు నగర పౌరునికి స్వచ్ఛ్ హైదరాబాద్ ఆవశ్యకతను తెలియజేసేలా కార్యోన్ముఖులవుతున్నారు. పాటలు, ఆల్బమ్‌లు, కళారూపాలతో ప్రజల వద్దకు వెళ్లి, కార్యక్రమ ప్రాముఖ్యాన్ని వివరిస్తాం. విశ్వనగరంగా హైదరాబాద్‌ను నిలబెట్టే ఈ చారిత్రక ప్రయత్నంలో స్వచ్ఛ హైదరాబాద్ ఒక మైలురాయిలా నిలుస్తందని నమ్ముతున్నాం.
రచయిత: తెలంగాణ సాంస్కృతిక సారథి, ఎమ్మెల్యే
(నేడు సీఎం చేతుల మీదుగా స్వచ్ఛ్ హైదరాబాద్ ప్రారంభం)