సురక్షిత రాజధాని కేసీఆర్ సంకల్పం

ఆ ఆశయ సాధనకు అంకితమవుదాం విశ్వనగర సాధనలో భుజం కలుపుదాం అభివృద్ధికి శాంతి భద్రతలు కీలకం మన పనితీరుపైనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇంటర్ సెప్టర్ వాహనాలు ప్రారంభించారు

Naini Narsimha Reddy

హైదరాబాద్ నగర శాంతిభద్రతల ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంకల్పించారని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. నగరాన్ని పూర్తిస్థాయి సేఫ్ అండ్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. కేవలం తూతూ మంత్రం చర్యలు కాకుండా పోలీసు వ్యవస్థను పటిష్ఠపరడం మీద దృష్టి పెట్టి, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పెట్రోలింగ్ వాహనాలు, మోటారు సైకిళ్లు, ఇతరత్రా అవసరాలకు రూ.430 కోట్లు కేటాయించారని నాయిని చెప్పారు. ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా నాయిని ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో సిటీ పోలీసు శాఖకు చెందిన ఇంటర్‌సెప్టర్ ఆర్మ్‌డ్ వాహనాలను హోంమంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం కోరినన్ని నిధులు ఇస్తుందున పోలీసులు కూడా ప్రభుత్వం ఆశించిన విధంగా పనితీరు చూపాలని సూచించారు. డీజీపీ అనురాగ్‌శర్మ పనితీరును గుర్తించి సీఎం ఆయనను ఏరికోరి డీజీపీగా తెచ్చుకున్నారని చెప్పారు. ఆయన కూడా సీఎం అంచనాల మేరకు కష్టపడుతున్నారని ప్రశంసించారు. నూతనంగా సమకూర్చిన వాహనాలతో పెట్రోలింగ్‌ను బాగా పెంచాలని సూచించారు. ఈ వాహనంలోని పోలీసులు ఆయుధాలు ధరించి తిరుగుతారని, తద్వారా నేరగాళ్లలో భయం పుట్టడంతోపాటు ప్రజల్లో భద్రతా భావన ఏర్పడుతుందని చెప్పారు. ఈ వాహనాల వల్ల నగరంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా 15 నిమిషాల్లో పోలీసులు చేరుకోగలుగుతారని చెప్పారు. ప్రస్తుతం 17 ఇంటర్‌సెప్టర్ వాహనాలు మంజూరు చేశామని త్వరలోనే మరో 25 వాహనాలు కూడా రానున్నాయని చెప్పారు.

Police

అభివృద్ధి ప్రక్రియలో పోలీసులదీ కీలకపాత్రే
అభివృద్ధి ప్రక్రియలో శాంతి భద్రతలను రక్షించే పోలీసులది కూడా కీలకపాత్రేనని అంటూ శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పుడే పరిశ్రమలు తరలి వస్తాయని నాయిని అన్నారు. రాష్ర్టాభివృద్ధికి హైదరాబాద్ అభివృద్ధి ప్రధానమని , ఈ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి సంకల్పమని చెప్పారు. ఈ ఆశయసాధనలో పోలీసుశాఖ కీలకపాత్ర వహించాలని అన్నారు.
పోలీసు శాఖ ఎంతబాగా పనిచేస్తే హైదరాబాద్ ఇమేజ్ అంతగా పెరుగుతుందని అన్నారు. నగరంలో చైన్‌స్నాచింగ్, మహిళలపై లైంగిక దాడులు, రౌడీలు, గుండాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. పోలీసు స్టేషన్‌లో వాతావరణం పూర్తిగా మారాలని ప్రజలతో స్నేహపూర్వకంగా ప్రవర్తించాలని అన్నారు. స్టేషన్‌కు వచ్చిన ప్రజలకు గౌరవం ఇస్తూ, మర్యాదగా నడుచుకోవాలన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్ల పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలను హోంమంత్రి అభినందించారు. ప్రభుత్వం ఆశించిన విధంగా అధికారులు, వారి ఆలోచనలకు అనుగుణంగా సిబ్బంది పనిచేయాలని మార్గదర్శనం చేశారు. హైదరాబాద్ కమిషనర్ పలు కార్పోరేట్ సంస్థలతో ఈ మేరకు శిక్షణ ఇప్పించడం అభినందనీయమని అన్నారు.

మొదట్లో హోం వద్దన్నా…
తనకు రాష్ట్ర కేబినెట్‌లో హోంశాఖ ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పినపుడు తొలుత వద్దని అన్నానని… అయితే ఇపుడు ఈ శాఖను నిర్వహించడం గర్వంగా ఉందని అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య కారణంగా నేరాలు పెరుగుతున్నాయని నాయిని అన్నారు. రోజురోజుకు ప్రజలకు అవసరాలు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో నిరుద్యోగులు అశాంతికి గురై నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. చేతినిండా పని ఉంటే నేరాలుచేయాలన్న ఆలోచనలు దరి చేరవన్నారు.