స్థానికేతరులకు ఓట్లేస్తరా?

ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి అమెరికా నుంచి, కాంగ్రెస్ అభ్యర్థి హైదరాబాద్ నుంచి దిగుమతి అయ్యారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి మాత్రం లోకల్. స్థానికేతరులకు ఓట్లేస్తారా? బీజేపీ అభ్యర్థి డాలర్ బిల్ల, కాంగ్రెస్ అభ్యర్థి చెల్లని గవ్వ.
-ప్రతిపక్షాలవి చౌకబారు విమర్శలు: డిప్యూటీ సీఎం కడియం
-దయాకర్‌కు భారీ మెజార్టీ ఖాయం: మంత్రి ఈటల
-డాలర్ బిల్ల.. చెల్లని గవ్వలు వాళ్లు: మంత్రి కేటీఆర్
-విపక్ష అభ్యర్థులకు సమస్యలు తెలియవు: మంత్రి హరీశ్‌రావు
-వరంగల్ ఎల్లలైనా తెలుసా?: మంత్రి జగదీశ్‌రెడ్డి

KTR election campaign in Hanamkonda

ప్రజాసమస్యలు తెలియని వీరితో వరంగల్ ప్రజలకు ఒరిగేదేమీలేదు అని ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి హన్మకొండ తారాగార్డెన్‌లో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ విసృతస్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. జయశంకర్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో, సుధానగర్‌లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ చిరిగిన ఓ రూపాయి నోటు చూపిస్తూ.. ఇది హైదరాబాద్‌లో చెల్లలేదని, దీన్ని వరంగల్‌కు తీసుకొస్తే ఇక్కడా చెల్లలేదన్నారు.
అలాగే హైదరాబాద్‌లోని మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి వరంగల్‌లో ఎలా గెలుస్తాడని ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థి డాలర్ బిల్లని, ఆ డాలర్ ఇక్కడ చెల్లదన్నారు. అసలు సిసలైన రూపాయి బిల్ల టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. గతంలో ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టండని, ఇప్పుడు ఇంటింటికీ నీళ్లివ్వకుంటే ఓట్లడగనని చెప్పిన మొనగాడు సీఎం కేసీఆర్ ఒక్కరేనన్నారు. కాంగ్రెస్, బీజేపీ వైఖరి ఎలా ఉందంటే పని చేసేటోని కాళ్ల మధ్య కట్టె పెట్టడం తప్ప, తెలంగాణను అభివృద్ధి చేయాలనే సోయిలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే అంధకారంగా మారుతుందని చెప్పిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఇవాళ అంధకారంలో ఉన్నాడని, తెలంగాణ మాత్రం దేదీప్య మానంగా వెలుగుతున్నదన్నారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఉద్యమం నుంచి పుట్టిందే తెలంగాణ మజ్దూర్ యూనియన్ అని, కార్మికులు రాష్ట్ర సాధనలో నిర్వహించిన పాత్రను గుర్తు చేశారు. చరిత్రలోనే అడిగిన దానికి కంటే ఎక్కువగా ఆర్టీసీ కార్మికులకు ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కేసీఆర్ రవాణాశాఖ మంత్రిగా పనిచేశారని, కార్మికుల కష్టాలేమిటో తెలుసన్నారు. జీతాభత్యాలపెంపుతో నెలకు రూ.75 కోట్లు భారమైనా 44 శాతం ఫిట్‌మెంట్, 4,300 మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేశారని తెలిపారు. సంస్థను బలోపేతంచేయడానికి బడ్జెట్‌లో గ్రాంట్ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రజాసమస్యలు తెలియని బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో ఎంపీలు సీతారాంనాయక్, గుండు సుధారాణి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి, యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు నన్నపునేని నరేందర్, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Rasamai Balakishan election campaign in Station ghanpur

అభివృద్ధి కోసం కారుకు ఓటెయ్యండి: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి పసునూరి దయాకర్‌ను ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ధర్మసాగర్ మండలంలో ఎమ్మెల్సీ పల్లా రా జేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే టీ రాజయ్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇవ్వని హామీలను సైతం నెరవేరుస్తూ దేశంలోనే తెలంగాణను అన్నిరంగాల్లో ముందుండేలా సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న సాగునీటీ ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసి రైతులకు సాగునీరు అందివ్వనున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను గమనించి ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు.

Pasunuri Dayakar election campaign in Kodakandla

అసహనంతో ప్రతిపక్షాల విమర్శలు: డిప్యూటీ సీఎం కడియం
ఐదేండ్ల కోసం ప్రజలు మా పార్టీని గెలిపించి అధికారం కట్టబెట్టారు. అభివృద్ధి చేయకపోతే అదే ప్రజలు తిరిగి ఎన్నికల్లో తిరస్కరిస్తారు. పనులు చేస్తే మళ్లీ గెలిపిస్తారు. ఆ ఓపిక లేని ప్రతిపక్షాలు అసహనంతో చౌకబారు విమర్శలు చేస్తున్నాయి అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మండిపడ్డారు. దేవరుప్పుల సభలో ఆయన మాట్లాడారు. అధికారం కోల్పోయిన కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేగా ఉండీ ఏమీ చేయలేనిస్థితిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు దిక్కుతోచక సొల్లు మాటలు మాట్లాడితే వినేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాసమస్యలే కాదు, జిల్లాలో ఎల్లలు తెలియని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఉపఎన్నికలో ప్రజలు ఎలా ఆదరిస్తారని, వారు చెల్లని నాణాలేనన్నారు. పనిచేసే వాడికే ఓటడిగే హక్కు ఉంటుందని, కాంగ్రెస్ అభ్యర్థికి జిల్లాలోఒక్క ఊరు పేరు కూడా తెలియదని, 40 ఏండ్లు విదేశాల్లో డబ్బు సంపాదనలో లీనమైన బీజేపీ అభ్యర్థికి సమస్యలపై అవగాహన లేదని, వీరిద్దరూ టీఆర్‌ఎస్ అభ్యర్థి దయాకర్‌కు ఏ విషయంలోనూ సరితూగరన్నారు. అన్నం పెట్టిన వాడిని ప్రజలు ఆదరిస్తారని, తెలంగాణకు కన్నం పెట్టిన టీడీపీ చెబితే ఓట్లెలా పడుతాయన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ ఎన్ సుధాకర్‌రావు, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.

Etela Rajendar eleciton campaign in Athmakur mandal of Parakal constituency

విపక్షాలకు సమస్యలు పట్టవు: మంత్రి ఈటల
కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ఏనాడు ప్రజాసమస్యలను పట్టించుకోలేదని, ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఆత్మకూరు మండలం అక్కంపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే ఎన్నో సంస్కరణలకు బీజం వేసి రైతులకు బాసటగా నిలుస్తున్నదన్నారు. విపక్షాల తప్పు డు ప్రచారాన్ని తిప్పికొట్టి పసునూరి దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, బానోత్ శంకర్‌నాయక్, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి ఉన్నారు.