స్థానిక ఉపపోరులో కారుజోరు

స్థానిక సంస్థల్లో ఖాళీలు ఏర్పడిన సర్పంచ్, జెడ్పీటీసీ, వార్డు సభ్యుల స్థానాలకు ఆరు జిల్లాల్లో శనివారం నిర్వహించిన ఉప ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయభేరి మోగించారు. పార్టీ గుర్తుతో సంబంధం లేకుండా జరిగిన ఈ ఎన్నికల్లోనూ అధికార పార్టీ మద్దతుదారులనే ప్రజలు గెలిపించారు. రెండు మేజర్ పంచాయతీలైన నియోజకవర్గ కేంద్రాలు నకిరేకల్, జడ్చర్లతోపాటు మరో పది సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. పన్నెండు స్థానాల్లో ఏడుచోట్ల టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచి ఆధిక్యం ప్రదర్శించారు. నల్లగొండ జిల్లాలో 9 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఐదు సర్పంచు స్థానాల్లో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.
-పార్టీ గుర్తులేకుండా జరిగే ఎన్నికల్లోనూ మెజారీటీ
-పన్నెండు సర్పంచ్ స్థానాల్లో ఏడు కైవసం
-131 వార్డుస్థానాల్లో 77చోట్ల టీఆర్‌ఎస్ మద్దతుదారుల గెలుపు

TRS

ఒక్క నకిరేకల్ నియోజకవర్గంలో ఏడు సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ నేతృత్వంలో మిగతా పార్టీలన్నీ కూటమిగా ఏర్పడినా టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు నాలుగు సర్పంచు స్థానాలను దక్కించుకురన్నారు. నకిరేకల్ మేజర్ పంచాయతీలో 20 వార్డుల్లో 14 స్థానాలను టీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలిచారు. నకిరేకల్ మండలంలోని చందుపట్ల, తాటికల్, నోముల, నెల్లిబండ గ్రామాల్లో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరు మండలంలో మానాయికుంటలో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని చిప్పలపల్లి పంచాయతీ సర్పంచ్‌గా టీఆర్‌ఎస్ బలపరిచిన పొట్ట అరుణ గెలుపొందారు. గ్రామంలో 1,020 ఓట్లకు 915 ఓట్లు పోలయ్యాయి. అరుణకు 470 ఓట్లు, బీజేపీ బలపరిచిన కుంటి సువర్ణకు 431ఓట్లు వచ్చాయి. సువర్ణపై అరుణ, 39 ఓట్ల మోజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన ఎర్ర సుజాతకు 10 ఓట్లు, టీడీపీ బలపరిచిన బేగరి మమతకు నాలుగు ఓట్లు వచ్చాయి. వికారాబాద్ మండలం నారాయణపూర్ సర్పంచ్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ బలపరిచిన ఆలంపల్లి సుబాష్ రెడ్డి కి  117 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 696 ఓట్లకు 625 ఓట్లు పోలవగా, సుభాన్‌రెడ్డికి 371 ఓట్లు, ప్రత్యర్థి ప్రహ్లాద్‌రెడ్డికి 254 ఓట్లు వచ్చాయి.

వార్డు స్థానాల్లోనూ అదేజోరు
నల్లగొండ జిల్లాలో 115 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగ్గా 69 వార్డు స్థానాల్లో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ప్రజాఫ్రంట్ 27, ఇతరులు 11, కాంగ్రెస్ 8 స్థానాల్లో గెలిచింది. వీటిలో 19 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో ఎనిమిది వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగితే ఐదుచోట్ల టీఆర్‌ఎస్ బలపరిచిన, మూడు స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన, ఒక స్థానంలో ఎంఐఎం బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. ఆదిలాబాద్ జిల్లా నెన్నెలలోని ఒకటో వార్డులో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలిచారు. ఖమ్మం జిల్లాలో ఏడు వార్డులకు ఎన్నికలు నిర్వహించగా తలా రెండు స్థానాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఎం, ఒక స్థానంలో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు.