స్థానిక సంస్థల బలోపేతానికి కొత్త చట్టం!

-13వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు 70 శాతం నిధులు
-అసెంబ్లీలో పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్

KTR

పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి కే తారక రామారావు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పాలక సంస్థలను గ్రామపంచాయతీలుగా కాకుండా స్థానిక ప్రభుత్వాలుగా భావిస్తున్నామని చెప్పారు. వాటి బలోపేతానికి 13వఆర్థిక సంఘం నిధులను 70% నేరుగా కేటాయిస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థలను తీర్చిదిద్దేందుకు కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తేవాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై అన్ని పార్టీలతో చర్చిస్తామన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డిమాండ్లపై గురువారం అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. స్థానిక పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడానికి 2900 గ్రామాల్లో గ్రామీణ సమగ్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటి ద్వారా పింఛన్లు, ఇతర సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక సంస్థలను పటిష్ఠం చేయడానికి 73,74 రాజ్యాంగ సవరణ ద్వారా సర్పంచ్‌లు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు అధికారాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

అధికారాలు అప్పగించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను కూడా నిర్వర్తించాలని చెప్పారు. గ్రామపంచాయతీలు స్వయం సమృద్ధిని సాధించేలా స్థానిక ప్రజాప్రతినిధులు బకాయిలను వసూలు చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రజల దగ్గరకు చేరాలనేది టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న గిరిజన గూడెంలు, తండాలను పంచాయతీలుగా ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వచ్చే పంచాయతీ ఎన్నికలు కొత్త పంచాయతీల్లో జరుగుతాయని చెప్పారు. గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలను చెల్లించేందుకు పంచాయతీ నిధుల్లో 20శాతం వినియోగించాలని ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఈ వివాదాలను పరిష్కరించేందుకు డిస్కంలతో చర్చించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకీ సొంత భవనాలు నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పింఛన్ల చెల్లింపులో కొన్ని లోపాలున్నాయన్న కేటీఆర్ త్వరలోనే వాటిని అధిగమిస్తామన్నారు. రాష్ట్రంలోని ఎస్సీలు, ఎస్టీలు, పేదలు, మహిళల స్థితిగతులను మెరుగు పరిచేందుకు రూ.642కోట్లతో 150 మండలాల్లో తెలంగాణ పల్లె ప్రగతి పథకాన్ని అమలుచేయనున్నట్లు తెలిపారు.