స్టార్టప్‌ల కేంద్రంగా హైదరాబాద్

స్టార్టప్‌ల కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు, కొత్త ఐటీ ఆవిష్కరణలకు పెద్ద పీట వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఐటీ రంగాన్ని రాష్ట్రంలో మరింత విస్తరించేందుకు టీ హబ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), నల్సార్ యూనివర్సిటీలతో సంయుక్తంగా టీహబ్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.
-ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రొత్సహించేందుకే టీహబ్ ఏర్పాటు

KTR-inaugurating-T-hub01

-ఒకే గొడుగుకిందకు ఇంక్యుబేటర్‌లు
-ఐటీ మంత్రి కేటీఆర్ వెల్లడి
-గచ్చిబౌలిలో టీహబ్‌కు శంకుస్థాపన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన, ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ ఇంక్యూబేటర్ (టీహబ్) ఏర్పాటు పనులకు శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఐఐటీ క్యాంపస్ ఆవరణలో మంత్రి భూమి పూజ నిర్వహించారు. యానిమేషన్, ఇంక్యూబేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని టీ హబ్ పని చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. కొత్త ఆలోచనలకు కేంద్రంగా టీహబ్ మారుతుందని అన్నారు. ప్రపంచంలో ఎవరు కొత్త స్టార్టప్ సృష్టించినా అది హైదరాబాద్‌నుంచి ఉండేలా టీహబ్‌ను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోని ఐటీ ఇంక్యూబేటర్‌లన్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చేందుకే టీహబ్‌ను రూపొందించినట్లు చెప్పారు. దీనికి మానిటరింగ్ సహకారాన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ (ఐఐబీ) అందిస్తుందని చెప్పారు. కొత్త ఆవిష్కరణలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐఐఐటీ, న్యాయపరమైన సహకారాన్ని నల్సార్ యూనివర్సిటీ అందిస్తాయని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ 2018 నాటికి దేశంలోనే స్టార్టప్ కేంద్రంగా ఎదుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీహబ్ మొదటి దశ పనులను జూన్ 2లోపు ఐఐఐటీ ఆవరణలో చేపట్టనున్నట్లు చెప్పారు. రూ.35 కోట్లతో 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మొదటి దశలో చేపట్టే టీ హబ్ ద్వారా 2017నాటికి 400 స్టార్టప్‌లు, 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

మొదటి దశ పనులు పూర్తయ్యే క్రమంలోనే రెండవ దశ పనులను సమాంతరంగా రాయదుర్గంలో చేపడతామన్నారు. రెండవ దశకోసం కేంద్ర ప్రభుత్వ సహకారం కోరామని, అందుకు ప్రతిపాదనలు పంపాలని కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి చెప్పారని తెలిపారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఐటీ పాలసీని ప్రవేశపెడతామని కేటీఆర్ తెలిపారు.

స్తబ్దతలను ఛేదించిన హైదరాబాద్
హైదరాబాద్ అన్ని రకాల స్తబ్దతలను ఛేదించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలో రియల్ ఎస్టేట్‌రంగం పుంజుకుందని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన షెడ్యూల్ ఇప్పటికే ఖరారు కావడంవల్ల ఈ టూర్‌లో హైదరాబాద్ పర్యటన ఉండకపోవచ్చని కేటీఆర్ అన్నారు. అయితే ఒబామాను హైదరాబాద్‌కు తప్పక ఆహ్వానిస్తామన్నారు. టీహబ్ ఏర్పాటుతో ఐటీ రంగంలో హైదరాబాద్ చిరస్థాయిగా నిలిచిపోతుందని నాస్కామ్ చైర్మన్, టీహబ్ డైరెక్టర్ బీవీ మోహన్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో టెక్ మహీంద్ర సీటీవో ఏఎస్ మూర్తి, ఐఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ జే నారాయణన్, నల్సార్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డాక్టర్ ముస్తఫా ఫజల్, ఐఎస్‌బీ డైరెక్టర్ అజిగ్ రంజేకర్, రజనీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.