స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం

– కొత్త ఐడియాలకు చేయూత
– భావి స్టార్టప్ క్యాపిటల్‌గా హైదరాబాద్
– టై – ఐఎస్‌బీ కనెక్ట్ ప్రారంభ సభలో రాష్ట్ర మంత్రి కేటీఆర్

KTR

హైదరాబాద్ నగరాన్ని స్టార్టప్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఐటీ రంగంలో కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే యువ పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్ కంపెనీల ప్రోత్సాహానికే టీ – హబ్ ఏర్పాటుచేశామన్నారు. లాంచ్‌ప్యాడ్, యాక్సిలరేటర్, ప్రొఫెల్లర్ అనే మూడు విధానాలతో స్టార్టప్ కంపెనీలకు చేయూతనిస్తున్నామని గురువారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ది ఇండస్ ఎంటర్‌పెన్యూర్ (టై) – ఐఎస్‌బీ కనెక్ట్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తూ చెప్పారు. ఐటీ రంగంలో ఇన్నోవేషన్, ఇంకుబేషన్, ఇన్‌కార్పొరేషన్ విధానం అమలుచేస్తామని తెలిపారు. దేశ, విదేశాల నుంచి వచ్చేవారికి హైదరాబాద్‌లో కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం వసతులు కల్పిస్తుందని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి కొత్త ఆలోచనా విధానాలు, ఐడియాలకు హైదరాబాద్ పుట్టినిల్లవుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తంచేశారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో విధానంలో అనుమతులిస్తున్నామని తెలిపారు. ఐటీ రంగ పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్ ఎంతో అనువైనదన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉన్న భాగ్యనగరానికి పూర్తి రక్షణ ఉంటుందన్నారు.

భౌగోళికంగా, వాతావరణ పరంగా, భద్రతాపరంగా చాలా బాగుంటుందన్నారు. కనుక ఇక్కడ పెట్టుబడుల పెట్టడం శ్రేయస్కరమని చెప్పారు. భారీ పరిశ్రమల ఏర్పాటుకు 15 రోజుల్లో .. అదనపు ఏర్పాట్లకు 30 రోజుల్లో అనుమతులు మంజూరుచేస్తామని ఆయన వివరించారు. టాస్క్‌ఫోర్స్ పేరుతో ఐఐఐటీ, నల్సార్ వర్సిటీ, ఐఎస్‌బీ మధ్య ఒప్పందంతో సాంకేతిక విద్యారంగంలో ప్రత్యేకశిక్షణకు ప్రయత్నిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. పది ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 50 మంది విద్యార్థుల చొప్పున శిక్షణనిస్తామన్నారు. తెలంగాణ ఫార్మా రంగానికి ఎంతో అనుకూలమన్నారు. ఆ రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఇప్పటికే ముందుకొస్తున్నారన్నారు.

బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ మెకాలిస్టర్ మాట్లాడుతూ విజ్ఞానవంతమైన మానవ సంపద హైదరాబాద్ నగరానికి సొంతమన్నారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ అనువైందన్నారు. టై హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు సఫీర్ ఆదేనీ మాట్లాడుతూ పరిశ్రమలు పెట్టడానికి ముందుకొచ్చే వారికి ప్రభుత్వం అనుమతులు మంజూరుచేయడానికి సిద్ధంగా ఉన్నదన్నారు. దీన్ని పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, ఐఎస్‌బీ డీన్ అజిత్ రంగ్నేకర్, 33 స్టార్టప్ కంపెనీలకు చెందిన 700 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.