శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆగదు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఒప్పందాలను ఏపీ సీఎం చంద్రబాబు ఉల్లంఘిస్తున్నారు. ఏపీలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో తెలంగాణకు 54 శాతం ఇవ్వాలన్న ఒప్పందాన్ని బేఖాతర్ చేస్తూ తెలంగాణలో కరెంట్ కోతలకు కారణమయ్యారు. పదేండ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగాలన్నప్పుడు మేం ఒప్పుకోలేదా? మీ కార్యాలయాలు ఇక్కడే ఉన్నప్పటకీ మేం మీకు ఇబ్బందులు కలిగించలేదు. ఒప్పందాలకు మేం కట్టుబడి ఉన్నాం.
-విభజన ఒప్పందాలను ఉల్లంఘిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు
-తెలంగాణకు 54 శాతం విద్యుత్ ఎందుకు ఇవ్వడం లేదు?
-బాబు కుట్రలపై టీడీపీ నాయకులు నిలదీయరేం: మంత్రి హరీశ్‌రావు

Harish Rao

మా ప్రాంతంలో కరెంట్ కోసం శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే ఆపాలని కృష్ణా రివర్‌బోర్డుకు చంద్రబాబు ఎలా లేఖ రాస్తారు. హరిహరబ్రహ్మాదులు అడ్డొచ్చినా, చంద్రబాబు అరిచి గీపెట్టినా.. శ్రీశైలం ప్రాజెక్టు లో విద్యుత్ ఉత్పత్తి ఆపే ప్రసక్తే లేదు అని భారీ నీటి పారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు తేల్చిచెప్పారు. మంగళవారం మెదక్ జిల్లా సిద్దిపేట, చిన్నకోడూరు మండలాల్లో ఆయన పర్యటించారు. కోదండరావుపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.

పంటలు ఎండిపోకూడదనే ఉద్దేశంతో శ్రీశైలం ప్రాజెక్టు లో జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. చంద్రబాబు కుట్రలపై తెలంగాణ టీడీపీ నేతలు ఎందుకు నోర్లు మెదపడం లేదని ప్రశ్నించారు. రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రతిరోజూ రూ.15 కోట్లతో విద్యుత్‌ను కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నామన్నారు. పరిశ్రమలకు రెండు రోజులు కోత విధించైనా రైతాంగానికి 6 గంటల విద్యుత్‌ను అందజేస్తున్నామన్నారు.

ఏటా రూ.5 వేల కోట్లతో చెరువులను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కంకణబద్దులై ఉన్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పేరిట ఉన్న రేషన్, పింఛన్ కార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం పేరిట అందజేయనున్నట్లు వివరించారు. అర్హులందరికీ పింఛన్, ఆహార భద్రత కార్డులు అందజేస్తామని, ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు.