శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తాం

కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపి, తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు కుట్ర చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులను ఆదుకుంటామని స్పష్టంచేశారు. ఆదివారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల మండలం పెనిమిళ్లలో రూ.1.50 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
-పరిశ్రమలకు, హైదరాబాద్‌లో కోత పెట్టయినా..పంటలకు ఏడు గంటల కరెంటు ఇస్తాం
-తెలంగాణ రైతు నోట్లో మట్టి కొట్టేందుకు బాబు కుట్ర
-భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు

Harish Rao 01

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన టీడీపీ, కాంగ్రెస్ వారసత్వంగా వచ్చిన విద్యుత్ సమస్యను అధిగమించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్నదన్నారు. చంద్రబాబు తెలంగాణ రాష్ర్టాన్ని ఆగం చేయడానికి కుట్రలు చేస్తున్నారని, అయినా రైతులకు బయటి నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసి రోజుకు 6, 7 గంటల కరెంటు ఇస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబుకు కరెంటు ఉత్పత్తి చేసుకునేందుకు సీడబ్ల్యూసీ అనుమతి కూడా లేదన్నారు.

శ్రీశైలంలో మన వాటా కరెంటును మనం ఉత్పత్తి చేసుకోకుండా ఇబ్బంది పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులను ఆదుకునేందుకు ఇప్పటి వరకు రూ.600 కోట్లు ఖర్చు చేసి కరెంటు కొన్నట్లు చెప్పారు. విభజన చట్టానికి లోబడి ఆంధ్రా నుంచి మనకు రావాల్సిన వాటా 54 శాతం కరెంటు ఇచ్చి ఉంటే ఈ సమస్య ఉండేదికాదన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ తెచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రాష్ర్టానికి వెళ్లినట్లు చెప్పారు. సోమవారం ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు అగ్రిమెంట్‌పై సంతకాలు చేయనున్నారని వివరించారు.

బీహెచ్‌ఈఎల్‌తో ఆరు వేల మెగావాట్లు, ఖమ్మం ఎన్‌టీబీసీలో నాలుగు వేల మెగావాట్లు, మహబూబ్‌గనర్ గద్వాలలో సోలార్ ద్వారా వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను తయారు చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇవన్నీ పూర్తవడానికి దాదాపు రెండేండ్ల సమయం పడుతుందన్నారు. రాష్ట్రంలో మొదటి పంటలను కాపాడుకునేందుకు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. అవసరమైతే పరిశ్రమలు, హైదరాబాద్‌లో గంట, రెండు గంటలు కోతలు విధించి పంటలను కాపాడుతామని స్పష్టం చేశారు.

ఈ ఏడాది రబీలో వరి వేయకుండా అరుతడి పంటలు వేయాలని రైతులకు విజ్ఞప్తిచేశారు. కరెంటు సమస్య ఉన్నందున రైతులు పంటలు సాగుచేసి నష్టపోకుండా విద్యుత్ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఈ ఒక్కసారి అరుతడి పంటలు సాగుచేసి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అనంతరం అచ్చంపేటలోని శేఖరయ్య ఫంక్షన్‌లో జరిగిన కార్యక్రమంలో టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు పోకల మనోహర్‌తోపాటు 16 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, ఎంపీపీ పర్వతాలు, ముఖ్యనేతలు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.