సొసైటీల అభివృద్ధికి పూర్తిసహకారం

– వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వ కృషి
– గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక పథకాల అమలు
– సహకార సంఘాల చైర్మన్లతో మంత్రి కేటీఆర్

KTR meet with agriculture cooperative society members

సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి తోడ్పాటు అందిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో సహకార సంఘాల చైర్మన్లతో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు గ్రామీణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం పాటు పడుతుందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాలకు అత్యంత కీలక రంగాలైన సాగునీటి కల్పనకు మిషన్ కాకతీయ, తాగునీటికి తెలంగాణ నీటి పథకం, విద్య కోసం కేజీ టు పీజీ, సంక్షేమంలో పింఛన్లతో సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నామని మంత్రి స్పష్టం చేశారు. గ్రామాల్లోని రైతులు అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం గిట్టుబాటు కావాలని.. ఇందుకు రుణమాఫీతోపాటు ఇతర రాయితీలు అందిస్తున్నామన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గోడౌన్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ కూడా తన రాజకీయ ప్రస్థానం రాఘవాపూర్ సింగిల్ విండో సొసైటీ చైర్మన్‌గా ప్రారంభమైందని.. ఆయనకు సహకార సంఘ వ్యవస్థపై అవగాహన ఉందన్నారు. సొసైటీల అభివృద్ధిలో పూర్తి సహకారం ఉంటుందని మంత్రులు వెల్లడించారు. కరీంనగర్, నల్లగొండ సహకార బ్యాంకు, డైరీ విజయవంతంగా పని చేస్తున్నాయన్నారు. సహకార సంఘాల చైర్మన్లు ఈ సందర్భంగా మంత్రుల దృష్టికి పలు అంశాలు తెచ్చారు. చైర్మన్లకు గౌరవ వేతనం పెంచాలని, ప్రొటోకాల్ కల్పించాలని విన్నవించారు.

వీటన్నింటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. రుణాలు సకాలంలో చెల్లించిన వారికి 6శాతం రిబేట్ గతంలో ఇచ్చినట్లే ఈ ప్రభుత్వం కూడా ఇచ్చేలా చూస్తామని.. దీనికి సంబంధించి ఆయా శాఖల అధికారులతో మాట్లాడుతామన్నారు. త్వరలోనే అన్ని జిల్లాల చైర్మన్లతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామీణాభివృద్ధి శాఖ పథకాల అమలులో సహకార సంఘాలను ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. గ్రామీణాభివృద్ధి, మార్కెటింగ్ శాఖల గోడౌన్లు నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. సమావేశానికి కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావుతో పాటు వివిధ జిల్లాల సహకార సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు.

వాటర్‌షెడ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం: కేటీఆర్
రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని వాటర్‌షెడ్ పథకాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. తెలంగాణ వాటర్‌షెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పాలకూరి జానయ్యగౌడ్, నర్సింహల ఆధ్వర్యంలో బుధవారం సచివాలయంలో మంత్రి కేటీఆర్‌ను కలిసి ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.

వాటర్‌షెడ్ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ హెల్త్‌కార్డులు మంజూరు చేయడంతోపాటు, సిబ్బందికి విధించిన టార్గెట్‌ను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. వాటర్‌షెడ్ ప్రాజెక్టుల్లో చాలా కాలంగా పనిచేస్తున్న సిబ్బందికి ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలను పెంచాలని మంత్రి కేటీఆర్‌ను వారు కోరారు. తెలంగాణ వాటర్ షెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిమాండ్లను సావధానంగా విన్న మంత్రి కేటీఆర్, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.