స్మార్ట్ సిటీగా హైదరాబాద్

– స్నేహపూర్వక పోలీసింగ్ విధానం అమలు
– దేశంలోనే ఈవెంట్ హబ్‌గా హైదరాబాద్
– ఈవెంట్ అనుమతులకు సింగిల్‌విండో
– దేశంలోనే తొలి ఈవెంట్ అసోసియేషన్ ఏర్పాటు హర్షణీయం
– టీసీఈఐ ఆవిర్భావ సభలో ఐటీ, పీఆర్ మంత్రి కేటీఆర్

KTR 05
ఈవెంట్ ఫ్రెండ్లీ సిటీ కోసం పోలీసు విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. పీపుల్స్ ఫ్రెండ్లీగా తయారు చేసేందుకు ఆధునీకరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం దీనికి ప్రాధాన్యం ఇస్తున్నది. అందుకే ఏ ప్రభుత్వం కేటాయించినంతగా నిధులను ఖర్చు చేస్తున్నది. గ్లోబల్ మార్కెట్‌లో హైదరాబాద్‌ను ఓ స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నాం అని రాష్ట్ర పంచాయత్‌రాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు ఇప్పటికే భారత్‌లోనే ఈవెంట్ హబ్‌గా హైదరాబాద్ గుర్తింపును సాధించిందన్నారు. ఈవెంట్ రంగంలో మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దాని ద్వారా పర్యాటక రంగం విరాజిల్లుతుందని అభిప్రాయపడ్డారు.

బుధవారం నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ(టీసీఈఐ) ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. సింగపూర్, మలేషియా, చైనా దేశాలు టూరిజం, హాస్పిటాలిటీ రంగాలతోనే త్వరితగతిన అభివృద్ధిని సాధించినట్లు చెప్పారు. ప్రభుత్వం తరపున కూడా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ, పరిశ్రమలు, ఐటీ తదితర శాఖల సహకారంతో 52 వారాలు- 52 ఈవెంట్లు కార్యక్రమాన్ని చేపట్టాం. దానికి అపూర్వ స్పందన లభించింది. అదిప్పుడు 157కు పెరిగింది. ఇంకా 300 ఈవెంట్లకు చేరే అవకాశం ఉంది అని అన్నారు. అంటే రోజుకో ఈవెంట్ వంతున నిర్వహించే రోజు దగ్గరలోనే ఉందని సంతోషం వ్యక్తం చేశారు. దీనికోసం ఫ్రాంఛైజింగ్‌గా బ్యాడ్మింటన్, కబడ్డీ లీగ్‌ను నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఈవెంట్ ఆర్గనైజర్లు ఒకే వేదికపైకి వచ్చి అసోసియేషన్‌గా ఏర్పడడం హర్షించదగిన పరిణామమన్నారు. ఈవెంట్స్ నిర్వహణకు వివిధ శాఖల నుంచి అనుమతులు పొందేందుకు సింగిల్‌విండో విధానం అమలు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈవెంట్ రంగానికి ఇండస్ట్రీగా గుర్తింపు
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఈవెంట్ రంగానికి ఇండస్ట్రీగా గుర్తించింది. మరే రాష్ట్రంలోనూ ఇది లేదు. అనేక వృత్తులు ఇందులో ఉన్నాయి. ఈవెంట్లకు హైదరాబాద్ హబ్‌గా మారింది. ఇక్కడ అంతర్జాతీయ స్థాయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అందుకే ఏ కంపెనీ అయినా ఇక్కడే వారి సభలు, సమావేశాలను నిర్వహించుకునేందుకు ముందుకొస్తున్నాయి అని టీఎస్‌ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కే జయేష్‌రంజన్ చెప్పారు.

టీఎస్‌ఈఐ అధ్యక్షుడు సూరజ్‌సింగ్ మల్హోత్రా మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా ఈవెంట్ నిర్వాహకులమంతా ఒకే వేదికపైకి వచ్చామని, తెలంగాణలో క్వాలిటీ ఈవెంట్ల నిర్వహణ లక్ష్యంగా పని చేస్తామన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి నీరజ్ ఠాకూర్ మాట్లాడుతూ తమ వ్యాపారాన్ని ఆధునీకరించుకోవడంతో పాటు, నూతన ఆర్థిక విధానాలను ఆకర్షించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సినీ నటి పూనం కౌర్ సందడి చేశారు. టీసీఈఐ ప్రతినిధులు రాఖీ కైంకర్య, వెంకటేశ్, సుధాకర్, డీ నాయుడు, అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.