సిర్పూర్ అభివృద్ధికి వంద కోట్లు

-మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ
-ఎస్పీఎంలో ఉత్పత్తిని తిరిగి ప్రారంభిస్తాం
-మంత్రులు జోగు, అల్లోల భరోసా

ThummalaNageshwararao02

వెనుకబడిన సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.100 కోట్లు అదనంగా కేటాయిస్తామని రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు హామీ ఇచ్చారు. మంగళవారం మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో పలుఅభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనులు చేశారు. మంత్రులకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద మంత్రులకు ఎస్పీఎం కార్మికులు సమస్యలను మొరపెట్టుకున్నారు. మంత్రులు మాట్లాడుతూ ఎట్టిపరిస్థితిల్లోను మిల్లులో ఉత్పత్తిని పునఃప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు. తర్వాత రూ.17కోట్ల వ్యయంతో నిర్మించి రైల్వేఓవర్ బ్రిడ్జిని మంత్రి తుమ్మల ప్రారంభించారు. సిర్పూర్(టి) మండలంలోని టోంకిని పరిధిలోని తాటిచెట్టు వద్ద రూ.6.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హైలెవల్ వంతెన నిర్మాణానికి భూమి పూజ చేశారు.

కాగజ్‌నగర్ మండలం బారేగుడా, శివపూర్‌గ్రామాల సమీపంలోని బొక్కెనవాగుపై రూ.4 కోట్ల వ్య యంతో నిర్మించనున్న వంతెనకు భూమి పూజ చేశారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడా రు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ఎంతో శ్రమిస్తున్నారని, కార్యకర్తల సహకారం చాలా అవసమన్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి మాట్లాడుతూ ప్రాణహిత-చేవేళ్లకు జాతీయ హోదాకు కృషి చేస్తున్నామన్నారు. 16.40లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు రాజధాని తాగునీటి అవసరాలను తీర్చే ప్రాజెక్టుకు జాతీయహోదా తీసుకురావడానికి సీఎం కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. కార్యక్రమాల్లో పార్లమెంటరీ కార్యదర్శి (వ్యవసాయం) కోవ లక్ష్మి, ఎంపీ గెడాం నగేశ్, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, దివాకర్‌రావు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు పురాణం సతీశ్‌కుమార్, లోక భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.