సార్ ఆశయాల దిశగా ముందడుగు

– జయశంకర్ 81వ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
– తెలంగాణ భవన్‌లో సార్‌కు ఘననివాళి

KCR paid floral tributes to the statue of Prof Jayashankar

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, మహోపాధ్యాయ ప్రొఫెసర్ జయశంకర్ 81వ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్‌లో గురువారం జరిగిన వేడుకలకు హాజరైన సీఎం కే చంద్రశేఖర్‌రావు.. జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రూపకల్పనలో ఆయన ఆశయాల సాధన దిశగా ముందుకెళుతున్నామన్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, రాష్ట్రమంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర ప్రణాళికామండలి ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నేతలు నివాళులర్పించారు. జయశంకర్ సార్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ భవన్‌కు వచ్చిన సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు పార్టీ నేతలు, శ్రేణులు, సామాన్యులు పోటీపడ్డారు.

కొద్దిసేపు పార్టీ కార్యాలయంలో గడిపిన తర్వాత సీఎం కేసీఆర్ బయలుదేరి వెళ్లారు. తర్వాత హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ జయశంకర్‌సార్ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ పురోగతికి సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళుతున్నారని చెప్పారు. తమ ప్రభుత్వ అభివృద్ధి పథకాల ఫలితాలు వెలుగుచూసిన తర్వాత తమ పనితీరు సంగతి ప్రతిపక్షాలకు తెలుస్తుందన్నారు. పలువురు మహిళలు కూడా టీఆర్‌ఎస్ భవన్‌లో జయశంకర్‌కు నివాళులర్పించారు.