సింగపూర్ పోలీసింగ్‌పై సీఎం ఆరా

-నేర నియంత్రణపై అక్కడి కమిషనర్‌తో భేటీ
-నిఘా, ట్రాఫిక్ తదితరాలపై వివరాల సేకరణ
-సింగపూర్ పోలీస్ విధానాలపై అధ్యయనానికి సిద్ధమవుతున్న పోలీస్ ఉన్నతాధికారులు

KCR 01

ప్రపంచస్థాయి పోలీసింగ్‌లో హైదరాబాద్‌ను నిలుపాలని కృతనిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తన సింగపూర్ పర్యటనలో భాగంగా సింగపూర్ పోలీస్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) కమిషనర్‌తో శుక్రవారం సమావేశమయ్యారు.

పోలీసులు అనుసరిస్తున్న విధానాలు, పాటిస్తున్న పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా నేర నియంత్రణ కోసం అనుసరిస్తున్న వ్యూహాలపై కమిషనర్‌తో చర్చించారు. వారు పాటిస్తున్న విధానాలపై అక్కడి పోలీస్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. స్మార్ట్ అండ్ సేఫ్ సిటీగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా త్వరలో ఏర్పాటు చేస్తున్నామని అక్కడి పోలీస్ అధికారులకు కేసీఆర్ వివరించారు.

సింగపూర్ కంట్రోల్ సెంటర్‌లో పాటిస్తున్న విధానాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సింగపూర్ సిటీలో సీసీ కెమెరాల పనితీరు, వాటి టెక్నాలజీని పరిశీలించారు. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌లో అనుసరిస్తున్న పద్ధతులను సీఎం అధ్యయనం చేశారు. ఈ సమావేశంలో భారత హై కమిషన్ సెక్రెటరీ, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావ్, ఐజీ మహేష్ భగవత్ తదితరులు పాల్గొన్నారు.