స్థానిక వనరుల కల్పనకు ఉపాధి నిధులు

-రూ. 200కోట్లతో గోదాముల నిర్మాణం
-ప్రతి గ్రామంలో మహిళా సంఘాల భవనం
-చెరువులు, పంటకాల్వలు, కుంటల ఆధునీకరణ
-ప్రత్యేక దృష్టిసారించిన మంత్రి కే తారకరామారావు

KTR

కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులు సమర్థవంతంగా వినియోగించుకొని.. వాటి ద్వారా స్థానికంగా వనరులను అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు పెంచేందుకు రాష్ట్ర సర్కారు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నది. అదనపు వనరుల ఉత్పత్తి కల్పనతో అదనపు ఆదాయం పెంచే మార్గాలపై కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా గతంలో కేంద్ర ప్రభుత్వ నిధులను ఉపయోగించి ఆశించిన ఫలితాలు రాని శాఖలను గుర్తించే పనిలో అధికారులున్నారు. ఆశించిన ఫలితాలు రాని పథకాలకు ప్రాధాన్యత తగ్గించి.. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి శాఖల ద్వారా చేపట్టే ప్రతి పథకంపై ప్రత్యేక దృష్టిని సారించారు. అధికారుల ద్వారా ఏఏ విభాగంలో ఎన్ని నిధులు ఖర్చు చేస్తే ఎంత ఫలితం ఉంటుందని క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. ఏటా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎక్కువ నిధులు వచ్చే గ్రామీణాభివృద్ధి శాఖను స్థానిక వనరుల కల్పనకు సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖలు కసరత్తులు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూలీల వలసలను నివారించడంతో పాటు స్థానికంగా శాశ్వత వనరులను కల్పించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం 2005లో ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం తెలంగాణ ప్రాంతంలో ఆశించిన విధంగా వనరుల సృష్టి జరగలేదు. గడిచిన తొమ్మిదేండ్లుగా వేల కోట్ల రూపాయలు ఈ పథకంపై ఖర్చు చేసినా ఎలాంటి శాశ్వత వనరుల కల్పన జరగలేదని ప్రభుత్వ యంత్రాంగం గుర్తించింది. దీంతో ఉపాధి హామీ పథకంలో నిధుల నిరుపయోగాన్ని అరికట్టి..

ప్రజలకు, రైతులకు ఉపయోగపడే విధంగా పథకాన్ని తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాబోయే రోజుల్లో ఆహార భద్రత చట్టం అమలు, రైతులకు గిట్టుబాటు ధర, ధాన్యం సేకరణ చేపట్టేందుకు వీలుగా పెద్ద ఎత్తున గోదాములు(గిడ్డంగులు) నిర్మించాలని నిర్ణయానికి వచ్చింది. వీటికి ఉపాధి హామీ నిధులను అధిక మొత్తంలో వినియోగించుకోవాలని యోచిస్తున్నది. ఈమేరకు ఇటీవల జరిగిన పంచాయతీరాజ్ శాఖ, మార్కెటింగ్ ,ఆర్థిక శాఖల మంత్రుల సమావేశంలో రాబోయే ఐదేండ్లలో రాష్ట్రంలో 10లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ గల గోదాములను నిర్మించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈఏడాది రూ. 200కోట్లతో 500గోదాములను నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధంచేస్తున్నది. వీటితోపాటు ప్రతి గ్రామంలో ఉపాధి నిధుల ద్వారా సమభావన సంఘాల సభ్యులకు మౌలిక సదుపాయాలతో కూడిన మహిళా భవనాలు నిర్మించాలని నిర్ణయించింది.

ఈ నిర్మాణాలను కాంట్రాక్టర్లకు కాకుండా మహిళా సంఘాలకు అప్పగించాలని యోచిస్తున్నది. తద్వార మహిళల ఆర్థిక స్వాలంబనకు తోడ్పాటు అందించవచ్చని భావిస్తున్నది. అదే విధంగా ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో అంతరించి పోయిన చెరువులు, కుంటలు, పంట కాల్వలను బాగుచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈ ఏడాది రూ. 350కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసే అవకాశం ఉంది. మరో వైపు గ్రామాల్లో అంతర్గత రోడ్ల ఏర్పాటుకు కూడా ఉపాధి హామీ నిధులు వినయోగించనున్నారు.