షేడ్ నెట్‌తో నాలుగింతల దిగుబడి

-నెట్ల నిర్వహణకు రూ.250 కోట్లు మంజూరు
-మిషన్ కాకతీయలో 9 వేల ప్రతిపాదనలు
-భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు

Harish-Rao-visit-to-Siddipet

ఉద్యానవన శాఖ ద్వారా షేడ్ నెట్ (నీడనిచ్చే వలలు) నిర్మాణాల కోసం రూ.250 కోట్లు మంజూరు చేశామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. మంగళవారం మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డిలతో కలిసి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా పలుసమావేశాల్లో మంత్రి మాట్లాడారు. షేడ్‌నెట్ వల్ల పంటల దిగుబడి నాలుగింతలు పెరుగుతుందన్నారు. ఈ విధానం పేద రైతులకు వరమన్నారు. గత ప్రభుత్వాలు ఉద్యానవనశాఖ ద్వారా రైతులకు ప్రోత్సాహాన్ని అందించలేదని, తమ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరిచి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఉద్యావనశాఖ ద్వారా రైతులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని తెలిపారు.

మల్చింగ్ పద్ధతిని సైతం ఏర్పాటు చేసుకునేలా రైతులకు వెసులుబాటు కల్పించామన్నారు. రైతులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటే హైదరాబాద్‌లోని ఉద్యానవన ఎగ్జిబిషన్‌కు వెళ్లాలని సూచించారు. మిషన్ కాకతీయలో రాష్ట్రవ్యాప్తంగా 9 వేల ప్రతిపాదనలు వచ్చాయని, టెండర్లు పిలిచి ఐదునెలల్లోపు పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. వాటర్ గ్రిడ్ పథకాన్ని విజయంవంతానికి అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. వచ్చే నాలుగేండ్లలో ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందించకపోతే ఓట్లు అడగమని చెప్పిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు.