శరత్ కల సాకారం చేసిన సీఎం

-హృద్రోగంతో బాధపడుతున్న చిన్నారికి ఆత్మీయ పలుకరింపు
-త్వరగా కోలుకోవాలని దీవెనలు
-బాలుడి వైద్యానికయ్యే ఖర్చంతా భరిస్తాం..
-కుటుంబానికి ఇల్లు.. ఖర్చులకు రూ.5లక్షల ఆర్థికసాయం: ముఖ్యమంత్రి
-ఆనందంతో ఉప్పొంగిపోయిన తల్లిదండ్రులు

KCR-005

హృద్రోగంతో బాధపడుతూ అపోలో దవాఖానాలో చికిత్స పొందుతున్న వరంగల్ జిల్లా నర్మెట్టకి చెందిన 11ఏళ్ల కొండా శరత్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం మధ్యాహ్నం పరామర్శించారు. శరత్‌ను చూసి ఎలా ఉన్నావ్ శరత్ బాగున్నావా? అని ఆత్మీయంగా పలుకరించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే వచ్చి తమ బిడ్డను పలుకరించడతో పక్కనే ఉన్న శరత్ తల్లిదండ్రులు ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆనందంతో నోట మాటలు రాలేదు. ఆనందంతో శరత్ చేతులు జోడించి సీఎం కేసీఆర్‌కు నమస్కరించాడు. వారిద్దరి మధ్య సంభాషణ ఇలా సాగింది.
శరత్: నమస్కారం సార్.. బాగున్నాను.
సీఎం : పెద్దయ్యాక నువ్వు ఏం కావాలనుకుంటున్నావు?
శరత్: డాక్టర్ కావాలని ఉంది సార్.
సీఎం: నువ్వు తప్పకుండా డాక్టర్ అవుతావ్.. నీకేం భయం లేదు.. నేనున్నా. ఎంత ఖర్చయినా సరే భరించి నేను చదివిస్తాను.
శరత్: ఊళ్లో మాకు ఇల్లు కూడా లేదు సార్.
సీఎం: ఒక్క ఇంటి స్థలమే కాదు. ఇల్లు కూడా కట్టిస్తాను. నువ్వు త్వరగా కోలుకొని దవాఖాన నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత ఖర్చుల కోసం పార్టీ తరుపున రూ.5లక్షలు ఆర్థిక సహాయం కూడా అందజేస్తా. సరేనా శరత్ నేను వెళ్లొచ్చా?
శరత్: సార్ ఇప్పుడే పోవద్దు.. ఇంకా కొంచెం సేపు ఉండొచ్చు కదా? అని శరత్ అమాయకంగా అడగడంతో సీఎం అక్కడ నుంచి కదలలేకపోయారు. కొద్దిసేపు అక్కడే కూర్చుండిపోయారు. శరత్‌ను దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పారు. తొందరగా కోలుకోవాలని ఆశీర్వదించారు. ఆడుకోవడానికి బొమ్మలు, కావల్సినవన్నీ అందిస్తానని సీఎం శరత్‌కు హామీ ఇచ్చారు.

శరత్ కుటుంబ నేపథ్యమిదీ..
వరంగల్ జిల్లా నర్మెట్టకి చెందిన భాగ్య, బాలయ్య దంపతుల కుమారుడే శరత్. పుట్టుకతోనే గుండెసమస్యలతో బాధపడుతుండేవాడు. రానురాను శ్వాస తీసుకోవడం కూడా కష్టమైపోవడంతో బాలయ్య దంపతులు శరత్‌ను వైద్యుల వద్దకు తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు శరత్‌కు సెప్టల్ డిఫెక్ట్ ఉన్నట్లు ధృవీకరించారు. వెంటనే గుండె ఆపరేషన్ చేయాల, లేనిపక్షంలో ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని స్పష్టం చేశారు. కుట్టుమిషన్ కుట్టి పొట్టపోసుకునే బాలయ్య దంపతులు ఉన్నదంతా ఊడ్చి మూడేండ్ల వయసున్న శరత్‌కు 2005లో ఆపరేషన్ చేయించారు. కానీ జబ్బు మాత్రం పూర్తిగా నయం కాలేదు. అప్పటినుంచీ మందులతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల శరత్ మళ్లీ తీవ్రంగా అనారోగ్యం పాలవడంతో తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని అపోలో దవాఖానకు తీసుకొచ్చారు. మరోసారి శరత్‌కు ఆపరేషన్ చేసిన వైద్యులు అసహాయత వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యంలో పెద్దగా మార్పు లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రాణాపాయ జబ్బులతో బాధపడుతూ పిల్లలను పరామర్శించడానికి నెలకొల్పిన మేక్ ఏ విష్ అనే అంతర్జాతీయ సంస్థ ప్రతినిధి ప్రియ దవాఖానకు వచ్చి శరత్‌ను కలిశారు. బాబూ నీకేమైనా కోరికలున్నాయా? అని ప్రశ్నించగానే కేసీఆర్ సార్‌ను చూడాలని, ఆయనతో మాట్లాడాలని ఉన్నదని శరత్ సమాధానమిచ్చారు.

శరత్ కోరిక విన్న స్వచ్ఛందసంస్థ ప్రతినిధులు ఇటీవల సీఎం కేసీఆర్‌ను కలిసి శరత్ పరిస్థితి, కోరిక వివరించారు. స్పందించిన సీఎం అపోలో దవాఖానకు వచ్చి శరత్‌ను పరామర్శించారు. ఈ సందర్బంగా అపోలో దవాఖానల చైర్మన్ ప్రతాప్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడి కోరిక మేరకు ఓ ముఖ్యమంత్రి స్వయంగా దవాఖానకు వచ్చి అతడిని పరామర్శించడం, ఆత్మీయంగా మాట్లాడడం ఇంతవరకు దేశచరిత్రలోనే జరగలేదని చెప్పారు. శరత్ తల్లిదండ్రులు భాగ్య, బాలయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సందర్భంలో కేసీఆర్ సార్ గురించి టీవీ చెబుతుంటే ఆసక్తిగా విని ఆనందపడేవాడని చెప్పారు. ప్రభుత్వ సలహాదారులు కే వీ రమణాచారి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సీఎం వెంట ఉన్నారు.