సీమాంధ్ర కుట్రలపై జర పైలం

తెలంగాణ ప్రభుత్వంపై ప్రజలకు కోటి ఆశలు ఉన్నాయని, వారి ఆశలను నెరవేర్చడానికి తెలంగాణ ఉద్యోగుల సహకారం చాలా అవసరమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్‌మెంట్స్ ఇన్ తెలంగాణ (క్రెడిట్) ఆధ్వర్యంలో గురువారం టీజీవో కేంద్ర కార్యాలయంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడంలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు.

Etela Rajendar

-ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడంలో ఉద్యోగులది కీలకపాత్ర
-ప్రజల ఆశలు నెరవేర్చేందుకు సహకరించాలి
-కెడిట్ రౌండ్‌టేబుల్‌లో డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ
-ఆదాయం లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు
-ఆంధ్ర అధికారులు సహకరించడం లేదు
-అందువల్లే బడ్జెట్ రూపకల్పనలో కష్టాలు
-ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్య
రాష్ట్ర విభజన జరిగినా కీలక పోస్టుల్లో సీమాంధ్ర అధికారులే ఉన్నారని, ఉద్యోగుల విభజనపై కుట్రలు జరుగుతున్నందున తెలంగాణ ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఆదాయం లేనిదే అభివృద్ధి సాధ్యం కాదన్నారు. సమైక్య పాలనలో జరిగిన విధ్వంసాన్ని రూపుమాపడానికి సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని, అనేక కొత్త విధానాలకు రూపకల్పన చేస్తున్నారని తెలిపారు. ఎన్నివేల కోట్లు ఖర్చయినా సరే తెలంగాణను అభివృద్ధిపథంలో నడిపించాలనే కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి ఉన్నారని తెలిపారు.

బడ్జెట్ రూపకల్పనకు సీమాంధ్ర అధికారులు సహకరించకపోవడంతో చాలా కష్టాలు ఎదుర్కొన్నామన్నారు. ప్రభుత్వానికి రెవెన్యూను ఎక్కువగా అందించే కీలక శాఖలైన వాణిజ్య విభాగం, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రవాణాశాఖల అధికారులు క్రెడిట్‌గా ఏర్పడి తెలంగాణ ప్రజలకు అండగా నిలువడం, ప్రభుత్వ ఆదాయపెంపు మార్గాలను శోధించడం హర్షణీయమన్నారు.

గతంలో ప్రభుత్వాలు వేరు, అధికారులు వేరు అన్నట్టు పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం తెలంగాణలో ప్రజలు, అధికారులు, పాలకులు అందరూ ఒకటేనని చెప్పారు. మన దగ్గర ఉన్న వనరులన్నింటినీ ఉపయోగించుకొని ఆదాయాన్ని పెంచుకుందామని, అందుకు అధికారులు తగిన సలహాలతో ముందుకురావాలని మంత్రి ఈటెల సూచించారు. వచ్చే ఐదేండ్లలో ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేస్తామన్నారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన టీజీవో చైర్మన్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఆదాయం పెంచే విషయంలో అందరం ప్రభుత్వానికి అండగా నిలువాలన్నారు. ప్రధానమైన పోస్టుల్లో తెలంగాణ ఉద్యోగులను నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఐటీఐఆర్ ప్రాజెక్టు మొదటి దఫా పనులు ప్రారంభమైతే తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకుంటుందని చెప్పారు.

కమర్షియల్ ట్యాక్స్ ప్రతినిధి, రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ వివేక్ మాట్లాడుతూ తెలంగాణ ఆదాయంలో అగ్రభాగం కమర్షియల్ ట్యాక్స్ నుంచే వస్తుందన్నారు. గత 4 నెలల్లో రూ. 9,350 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, క్రెడిట్ కన్వీనర్, తెలంగాణ ట్రాన్స్‌పోర్టు టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌కుమార్, ఎక్సైజ్ ప్రతినిధి మాధవ్, భగవాన్‌రెడ్డి, రవీందర్‌రావు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రతినిధులు విష్ణువర్ధన్‌రావు, సహదేవ్, వివిధ విభాగాల ప్రతినిధులు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశం, సలీమొద్దీన్, మధుసూదన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, చందర్, వివేకానందరెడ్డి, ఎంబీ కృష్ణయాదవ్, ఓంప్రకాష్, వెంకట్‌రెడ్డి, చక్రవర్తిగౌడ్, చంద్రశేఖర్, రవీందర్, వెంకటేశ్వర్లు, చంద్రయ్య, రఘునందన్‌గౌడ్, గంథం రాములు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగుల కృషిని అభినందించిన కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ చర్చాంశాలను క్రెడిట్ ప్రతినిధులు గురువారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు అందించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు సీఎంను కలిశారు. ఆదాయ పెంపుదలకు ఉద్యోగుల కృషిని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అభినందించారు. పేదలపై భారం పడకుండా ఆదాయ పెంపుదలకు ఇచ్చిన సలహాలను తప్పకుండా స్వీకరిస్తామని సీఎం చెప్పారని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సీఎంను కలిసిన వారిలో టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, క్రెడిట్ కన్వీనర్ రవీందర్‌కుమార్, విష్ణువర్ధన్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, సహదేవ్, చందర్ తదితరులు ఉన్నారు.