సాయపడేందుకు సిద్ధం

– ఏపీ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ భరోసా

KCR
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే మానవత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం మరోసారి చాటుకుంది. హుదూద్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సాయమందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.
అవసరమైతే సహాయచర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలో ఉండగా అక్కడినుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఏపీ ప్రభుత్వానికి తమ సంసిద్ధతను తెలియజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు సూచించారు. సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగివచ్చిన వెంటనే తుఫాన్ ప్రభావంపై సీఎం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాజీవ్‌శర్మతోపాటు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. తుఫాన్ ప్రభావంపై ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లతో కేసీఆర్ మాట్లాడారు. ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇక తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకొంటున్న సహాయచర్యలను ముఖ్యమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫోన్‌లో వివరించారు.