సవాల్‌గా మిషన్ కాకతీయ

రాష్ట్రప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయను సవాల్‌గా స్వీకరిద్దామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ పథకంతో దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆయన అభిలషించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో అధికారులకు సర్వే పరికరాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంజినీర్లకు ఇదో మంచి అవకాశమని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సొంతఇల్లు నిర్మించుకుంటే ఎలా జాగ్రత్తగా ఖర్చుచేస్తామో మిషన్ కాకతీయ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఖర్చుచేయాలని అన్నారు.

-చెరువులు వినియోగంలోకివస్తే ఇంజినీర్లకే ఘనత
-ప్రతిమండలంలోని ఒక చెరువులో తట్టమోస్తా
-పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు
-నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
-ఇంజినీర్లకు సర్వే పరికరాలు అందజేత

Mission-Kakatiya-T-Harish-Rao-13-12-14 01రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపట్ల ఎంత ప్రేమగా ఉంటుందో పనుల్లో నాణ్యత పట్ల అంతే కఠినంగా ఉంటుందని స్పష్టంచేశారు. పనుల్లో రాజకీయ జోక్యం లేకుండా చూసే బాధ్యత తనకు వదిలేయాలని అన్నారు. నాణ్యత విషయంపై రాష్ట్ర కార్యాలయం నుంచి అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తారని, ఏ లోపాలున్నా అక్కడి ఇంజినీర్లదే బాధ్యత అని స్పష్టంచేశారు. వచ్చే వర్షాకాలానికి చెరువులు వినియోగంలోకి వస్తే ఆ ఘనత ఇంజినీర్లకే దక్కుతుందని చెప్పారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు.

రాష్ట్రంలోని ప్రతి మండలంలోని ఒక చెరువు పనుల్లో తట్టమోసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని హరీశ్ చెప్పారు. మిషన్ కాకతీయ ప్రారంభోత్సవానికి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారని తెలిపారు. మిషన్ కాకతీయలాంటి కార్యక్రమాన్ని బుదేల్‌ఖండ్‌లో ప్రారంభిస్తామని ఆమె ఇటీవల సీఎం కేసీఆర్ కలిసిన సందర్భంలో చెప్పారని వెల్లడించారు. పనుల్లో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తగా చేయాలని అన్నారు.