సర్వేజనా సుఖినోభవంతు

– సకలజన హితమే ప్రభుత్వ లక్ష్యం
– సమగ్ర సర్వేకు అరగంట సమయాన్నివ్వండి
– సర్వేతో స్థానికతకు సంబంధం లేదు
– త్వరలో కొత్తపారిశ్రామిక విధానం
– పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్

KTR

 

 

 

 

 

సర్వేజనా సుఖినోభవంతు అనేదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, సకల జన హితం కోసమే పని చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేకు ప్రజలందరూ అర్థగంట సమయాన్ని కేటాయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలనే ఉద్ధేశంతోనే ఈ నెల 19న సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. మంగళవారం పార్క్‌హయత్ హోటల్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన, సమగ్ర సర్వేపై మీడియా ప్రతినిధులు వ్యక్తంచేసిన సందేహాలకు సమాధానమిచ్చారు.

స్థానికతను నిర్ధారించటానికే తెలంగాణ ప్రభుత్వం సర్వే నిర్వహిస్తుందనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రేషన్ కార్డులు, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు కుదించటానికే ప్రభుత్వం సర్వే నిర్వహిస్తున్నదని కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు కక్షకట్టి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు చేసిన పొరపాట్లు మళ్లీ జరగకూడదనే ఈ సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. కుటుంబాల సమాచారం, బీసీల జనాభా గణాంకాలు, రాష్ట్రంలో ఎవరు ఎక్కడ ఉంటున్నారు? ఏం చేస్తున్నారు ? అనే సమాచారం ప్రభుత్వం వద్ద లేదని, ఈ సర్వేతో రాష్ట్ర సమగ్ర సమాచారం లభిస్తుందని అన్నారు. 19న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించినందున పౌరులందరూ సర్వేలో విధిగా పాల్గొనాలని సూచించారు. అనివార్య పరిస్థితుల్లో సర్వేలో పాల్గొనలేని వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై సర్వే పూర్తయిన తర్వాత మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

అన్ని రాష్ర్టాల మాదిరిగానే స్థానికత
స్థానికతపై దేశంలోని మిగితా రాష్ర్టాల మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని కేటీఆర్ స్పష్టం చేశారు. తమిళనాడులో తల్లిదండ్రుల జన్మ ప్రదేశం ఆధారంగా స్థానికతను నిర్ధారించి, వారి పిల్లలు దేశంలో ఎక్కడ విద్య అభ్యసించినా ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుందని చెప్పారు. కర్ణాటకలో కూడా ఇదే విధానం ఉందని తెలిపారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల విషయంలో తెలంగాణ మంత్రిమండలి సలహా ప్రకారమే గవర్నర్ నడుచుకోవాలని పునర్వ్యవస్థీకరణ బిల్లులో స్పష్టంగా ఉందని తెలిపారు. శాంతిభద్రతలపై గవర్నర్‌కు అధికారాలు కల్పించే లేఖ ప్రధానమంత్రికి, పీఎంవోకు తెలియకుండా వచ్చిందని కేంద్రం తెలిపిందన్నారు. బిల్లుకు విరుద్ధంగా ఉన్న అంశాలపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.

త్వరలో కొత్త పారిశ్రామిక విధానం
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం త్వరలో ప్రకటిస్తుందని కేటీఆర్ తెలిపారు. అభివృద్ధిలో ఎవరూ మాకు పోటీ కాదు. మేమెవరికీ పోటీ కాదు. మా రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, పారిశ్రామికంగా అభివృద్ధి సాదించడమే ప్రభుత్వ లక్ష్యం. పొరుగురాష్ర్టాల ప్రకటనలు చూసి పరిగెత్తాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సింగపూర్ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత నూతన పారిశ్రామక విధానాన్ని ప్రకటిస్తారని తెలిపారు. ఆ తర్వాత ఐటీ ప్రణాళికను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

కొత్త సాఫ్ట్‌వేర్ సంస్థలకు ప్రభుత్వ అండ
హైదరాబాద్‌లో నూతనంగా నెలకొల్పే ప్రతి సాఫ్ట్‌వేర్ కంపెనీని అన్నివిధాలుగా ఆదుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ రెండులోని సనాలీ ఇన్ఫో పార్క్‌లో నూతంగా ఏర్పాటైన పర్వాసియో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగాల్లో హైదరాబాద్ నగరాన్ని అత్యంత సమర్థవంతమైన నగరంగా మారుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సీఈవో, చైర్మన్ సంజయ్ కనోడియా, డైరెక్టర్ సీమా కనోడియా, డైరెక్టర్ అఫ్ సేల్స్ పీ విజయ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.