సర్పంచ్‌లకే చెక్ పవర్

– వేతన పెంపు అంశంపై త్వరలో నిర్ణయం
– సంక్షేమ పథకాల బాధ్యత మీదే..
– స్థానిక సంస్థల బలోపేతానికి కట్టుబడి ఉన్నాం
– సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్లతో మంత్రి కేటీఆర్ భేటీ

KTR addressing sarpanches and ZP Chairperson of Telangana

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తొలి సర్కారు సర్పంచ్‌లకు తీపి కబురు అందించింది. గ్రామ పంచాయతీ నిధుల వినియోగంపై విధించిన జాయింట్ చెక్‌పవర్ ఆదేశాలను ఉపసంహరిస్తూ.. సర్పంచ్‌లకు చెక్‌పవర్ కల్పించాలని నిర్ణయించింది. గురువారం సచివాలయంలో తెలంగాణ గ్రామ పంచాయతీ సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మల్లేపల్లి సోమిరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డిల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు, రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, కమిషనర్ అనితా రాంచంద్రన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానికసంస్థల బలోపేతంపై చర్చించిన మంత్రి కేటీఆర్.. సర్పంచ్‌లకు చెక్‌పవర్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.

స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల డిమాండ్లను సానుకూలంగా విన్న మంత్రి కే తారక రామారావు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ అంశంపై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని కేటీఆర్ తెలిపారు. గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత సర్పంచ్‌లపై ఉందన్నారు. పంచాయతీల ఆదాయాలను పెంచి గ్రామాలను స్వయం సమృద్ధిగా మార్చుకోవాలని కేటీఆర్ సూచించారు. ఈ ప్రయత్నంలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గంలోని 92 గ్రామ పంచాయితీల్లో 100 శాతం ఆస్తిపన్నుల వసూలును పూర్తి చేసినట్లు ప్రజాప్రతినిధులకు వివరించారు.

కేంద్ర బడ్జెట్‌తో తీవ్ర నష్టం: క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పంచాయితీరాజ్ శాఖకు తీవ్ర నష్టం ఏర్పడిందని చెప్పారు.

గ్రామాలాభివృద్ధికి ఇచ్చే బీఆర్‌జీఎఎఫ్, పీఎంజీఎస్‌వై, ఎన్‌ఎస్‌ఆర్‌జీపీ, ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ పథకాలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత కల్పించిందన్నారు. పంచాయితీరాజ్ చట్టానికి సవరణలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని, ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిల కారణంగా పంచాయతీ కార్యాలయాలు, విద్యుత్ బోర్లకు విద్యుత్ కనెక్షన్లు తొలగించవద్దని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలను విజయవంతం చేస్తూ , స్వయం సమృద్ధి సాధించే గ్రామాలకు ప్రోత్సాహాకాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైన మైనర్ గ్రామ పంచాయితీలకు ప్రోత్సాహక నిధులను రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు, మేజర్ పంచాయతీలకు రూ.10 లక్షల నుంచి రూ.15లక్షలకు పెంచినట్లు తెలిపారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాములు నాయక్, రంగారెడ్డి , నల్లగొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ చైర్మన్లు పట్నం సునితా మహేందర్‌రెడ్డి, బాలు నాయక్, తుల ఉమ, భాస్కర్, తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్స్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, సర్పంచ్‌ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న, సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోలిపురం రాంరెడ్డి, రాజేష్‌నాయక్, కృష్ణారెడ్డి ఎంపీటీసీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కరుణాకర్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.