సర్కారు దవాఖానలపై నమ్మకాన్ని పెంచుతాం

-త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఈ-హెల్త్ సేవలు
-ఏకకాలంలో వెబ్‌కెమెరాలో ఎక్కడి నుంచైనా వీక్షించే అవకాశం
-వైద్యపరీక్షల నివేదికలను ఆధార్‌కార్డుతో అనుసంధానం చేస్తాం
-జడ్చర్లలో ఈ-హెల్త్ సేవల ప్రారంభంలో మంత్రి కేటీఆర్

Ministers KTR and Laxma reddy Inaugurating e hospital in Jadcherla

సీమాంధ్రుల పాలనలో సర్కారు దవాఖానలంటేనే ప్రజల్లో నమ్మకం లేని పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితుల నుంచే నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే సినిమా పాట 1980 దశకంలో వచ్చింది. కానీ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడా పరిస్థితిని పూర్తిగా మార్చేస్తున్నాం. సర్కారు దవాఖానల్లో నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్‌స్థాయి వైద్యం అందుతుందనే నమ్మకాన్ని కల్పిస్తాం అని పంచాయతీరాజ్, ఐటీశాఖలమంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా ఐటీశాఖ, వైద్యారోగ్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో ఈ-హెల్త్ సేవలను మంగళవారం ప్రయోగాత్మకంగా ఆయన ప్రారంభించారు.

దవాఖానను 30 పడకల నుంచి 100 పడకల స్థాయికి పెంచడానికి అనువుగా ప్రతిపాదిత భవననిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాత దవాఖానలో వార్డులను సందర్శించి వైద్యసేవలు అందుతున్న తీరుపై రోగులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలు, నిపుణులైన వైద్యులు దవాఖానకు వచ్చే రోగులను పరీక్షించి రిపోర్టులను వెబ్ కెమెరాల ద్వారా ఏకకాలంలో జిల్లా కేంద్రంతోపాటు హైదరాబాద్, అమెరికాలో ఉండే వైద్యనిపుణులు వీక్షించే అవకాశం ఉంటుందన్నారు. వారిచ్చే సూచనలు, సలహాలతో మెరుగైన వైద్యసేవలందించడానికి ఈ-హెల్త్ విధానం ఉపయోగపడుతుందన్నారు. ఈ విధానం ద్వారా అనవసర ఖర్చు, కాలయాపన, ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉండబోదన్నారు.

భవిష్యత్‌లో పీహెచ్‌సీల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. సమగ్ర కుటుంబ సర్వే మాదిరిగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డులను కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసి ఆధార్‌కార్డుతో అనుసంధానం చేసే యోచన ప్రభుత్వానికి ఉందన్నారు. దీంతో చేసిన పరీక్షలే మళ్లీ చేయకుండా వెంటనే వైద్యసేవలు అందించి ప్రాణాపాయస్థితి నుంచి బయటపడేసే అవకాశం ఉంటుందన్నారు. భవనాలు, వైద్యులు, మందుల కొరత లేకుండా కార్పొరేట్ వైద్యసేవలు అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కాలేయ మార్పిడి చేయాలంటే దాదాపు రూ.40 లక్షలు ఖర్చవుతుందని, ఇటీవల ఉస్మానియా దవాఖానలో ఉచితంగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారని గుర్తుచేశారు. వైద్యారోగ్యశాఖ మంత్రిగా లక్ష్మారెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే వైద్యరంగంలో సంచలన మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు.

ఆరోగ్య తెలంగాణే లక్ష్యం : మంత్రి లక్ష్మారెడ్డి
ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించి ఆరోగ్య తెలంగాణ సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. 90 శాతం పేదలకు ప్రభుత్వ సేవలు అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే సర్కారు దవాఖానలంటే ప్రజలకు నమ్మకంలేని దుస్థితి నెలకొన్నదన్నారు. అలాంటి భావనను మార్చేందుకు అన్ని దవాఖానల్లో దశలవారీగా స్థాయి పెంచడంతోపాటు అత్యాధునిక వైద్యసేవలు పేదలకు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. సంజీవని ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టి జిల్లా కేంద్రంలోని దవాఖానలో ఐసీయూ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్‌లో అన్ని దవాఖనాల్లో ఐసీయూ ఏర్పాటు చేస్తామన్నారు. డబ్బుల్లేక ఆరోగ్యాన్ని బాగు చేసుకోలేకపోయామన్న భావన ఎవరిలోనూ ఉండకుండా ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, కలెక్టర్ టీకే శ్రీదేవి, జేసీ రాంకిషన్, జిల్లా వైద్యాధికారి గోవింద్‌వాంగ్మోరే పాల్గొన్నారు.