సర్వతోముఖాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

-హైదరాబాద్ చుట్టూ పారిశ్రామిక క్లస్టర్లు
-ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి
-మేడ్చల్‌లో సెల్‌కాన్ మొబైల్స్ తయారీ యూనిట్ ప్రారంభం

KTR Launched Celkon mobile Unit

మొబైల్ రంగంలో తెలంగాణాను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. హైదరాబాద్ అంటే కేవలం ఐటీ, ఫార్మా హబ్ మాత్రమే కాదని ఇతర రంగాల్లో కూడా అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.

ప్రముఖ మొబైల్ ఫోన్ల సంస్థ సెల్‌కాన్ మేడ్చల్‌లో ఏర్పాటు చేసిన అసెంబ్లింగ్ యూనిట్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గచ్చిబౌలి, హైటెక్ సిటీలు కాకుండా హైదరాబాద్ నలువైపుల పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేయడానికి సీఎం కృషి చేస్తున్నారని, భవిష్యత్తులో మేడ్చల్ కూడా పారిశ్రామిక కేంద్రంగా అవతరించే అవకాశాలున్నాయన్నారు. ఒక దేశీయ మొబైల్ సంస్థ రాష్ట్రంలో యూనిట్‌ను ఏర్పాటు చేయటం గర్వంగా ఉందన్నారు. ఇది ఆరంభం మాత్రమే. ప్రస్తుతం సెల్‌కాన్, ఆ తర్వాత మైక్రోమ్యాక్స్, భవిష్యత్తులో మరిన్ని మొబైల్ సంస్థలు ఇక్కడే ప్లాంట్లను ఏర్పాటు చేయటానికి చర్చలు జరుగుతున్నాయి అని మంత్రి పేర్కొన్నారు. చైనా, కొరియా, తైవాన్ వంటి దేశాలకు ధీటుగా మొబైల్ తయారు చేసే స్థాయికి రాష్ట్రం ఎదగాలని ఆయన ఆకాక్షించారు.

KTR Launched Celkon mobile Unit01

మెగా ప్రాజెక్టులకు ఊతం
కొత్తగా ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చిన సంస్థలకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. దీంట్లో భాగంగా రూ.200 కోట్లకు పైగా పెట్టుబడులు, వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు కల్పించే మెగా ప్రాజెక్టులకు ఊతమివ్వనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులకు పన్ను రాయితీలు, మౌలిక వసతులు కల్పించడం, అవసరమైతే ప్రస్తుతం ఉన్న నిబంధనలను సవరించేందుకైన సిద్ధమని ప్రకటించారు. మేక్ ఇన్ తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించేందుకు ఎటువంటి సవరణలు చేసేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏరోస్పెస్ రంగానికి ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించి ఆ పరిశ్రమకు కూడా ఇలాంటి సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. మానవ వనరులను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, నైపుణ్యం లేనివారికి ఉచితంగా శిక్షణ ఇచ్చే కార్యక్రమాలను చేపట్టనున్నది కేటీఆర్ పేర్కొన్నారు.

నెలకు రెండు లక్షల ఫీచర్ ఫోన్ల ఉత్పత్తి: వై గురు
మేడ్చల్‌లో మొదటి విడుతలో రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న మొబైల్స్ తయారీ యూనిట్‌లో నెలకు 2 లక్షలకు పైగా ఫీచర్ ఫోన్లు ఉత్పత్తి చేస్తామని సెల్‌కాన్ సీఎండీ వై గురు తెలిపారు. 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంటులో ప్రస్తుతానికి నాలుగు లైన్లను ఏర్పాటు చేశామని, వచ్చే మూడు నెలల్లో 12 లైన్లకు విస్తరిస్తామని చెప్పారు. దీంతో మొబైళ్ల ఉత్పత్తి సామర్థ్యం ఐదు లక్షలకు చేరుకోనున్నదని వివరించారు. అలాగే 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గిడ్డంగిని, ముడి సరుకు నిల్వ చేసేందుకు మరో 5 వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో వేర్‌హౌజ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్లాంట్ వల్ల ప్రత్యక్షంగా 500 మందికి ఉపాధి లభించనున్నదని సెల్‌కాన్ మొబైల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళి రేతినేని చెప్పారు.