సన్నబియ్యం దారిమళ్లిస్తే జైలుకే

రాష్ట్రప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లకు, ప్రభుత్వ పాఠశాలలకు అందజేస్తున్న సన్నబియ్యాన్ని అక్రమంగా దారిమళ్లిస్తే క్రిమినల్ కేసులు నమోదుచేసి జైళ్లకు పంపుతామని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. హైదరాబాద్‌లోని మంత్రి ఈటెల నివాసంలో ఆదివారం ఆయనను పలువురు ఎస్టీ హాస్టల్ విద్యార్థులు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ సన్నబియ్యం పథకం కోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనుకాడబోదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆలోచనల మేరకు సన్నబియ్యం పథకం ప్రవేశపెట్టామని తెలిపారు.

Etela-Rajendar
-విద్యార్థులకు కడుపునిండా అన్నం పెడుతం
-సన్నబియ్యం పరిమితిని ఎత్తివేస్తాం
-ఆర్థికమంత్రి ఈటల స్పష్టీకరణ
-సన్నబియ్యంపై ప్రభుత్వానికి అభినందనల వెల్లువ
విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే.. వారికి సన్నబియ్యంతో అన్నం పెట్టాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. సన్నబియ్యం పథకంవల్ల ప్రభుత్వంపై ఏటా రూ.700 కోట్ల భారం పడుతుందని చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా భావి పౌరులైన విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈ పథకంలో ఎటువంటి అక్రమాలకు తావివ్వరాదనే ఉద్దేశంతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యార్థులకు సన్నబియ్యం అందించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు.

కాగా, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి విద్యార్థులకు అందజేసే సన్నబియ్యం పరిమితిని ఎత్తివేయాలని కోరగా అందుకు మంత్రి ఈటల సానుకూలంగా స్పందించారు. విద్యార్థులకు కడుపునిండా తిండి పెట్టాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పనిచేస్తున్నదని, త్వరలో సన్నబియ్యంపై పరిమితిని ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే కనకారెడ్డితో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అభినందనల వెల్లువ
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ హాస్టళ్లు, మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం పథకంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులతోపాటు పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఈ పథకం పట్ల హర్షం వ్యక్తంచేస్తున్నారు. వివిధ సంఘాల ప్రతినిధులు, రాజకీయ నేతలు, విద్యార్థులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నారు.

సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చి.. అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ పథకం ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్‌ను కలువడానికి సచివాలయానికి వచ్చిన సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు.. ఉమ్మడి రాష్ట్రంలో పురుగుల అన్నం-స్వరాష్ట్రంలో సన్నబియ్యం అని ప్లకార్డులు ప్రదర్శించారు.

కేసీఆర్ మాట – బంగారు బాట: శంకర్‌నాయక్
ఉస్మానియా యూనివర్సిటీ: సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గిరిజన విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఓయూజేఏసీ నాయకుడు జీ శంకర్‌నాయక్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి ఈటెల రాజేందర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థినీ విద్యార్థులతో ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి ఈటెల కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శంకర్‌నాయక్ మాట్లాడుతూ కేసీఆర్ మాట – బంగారు తెలంగాణ అభివృద్ధి బాట అనే నినాదంతో ముందుకుపోదామని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎస్ నేతలు రాజునాయక్, శ్రీను, రవి, యాకూబ్, నీల, నరేష్, తారాచంద్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

బంగారు తెలంగాణకు కృషిచేయాలి
-టీఎస్టీయూ కాల్యెండర్ ఆవిష్కరణలో ఈటెల
సీఎం కేసీఆర్ స్వప్నిస్తున్న బంగారు తెలంగాణ కల సాకారం చేసేవిధంగా ఉపాధ్యాయులు కృషిచేయాలని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పిలపునిచ్చారు. తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ (టీఎస్టీయూ) క్యాలెండర్‌ను ఆయన ఆదివారం ఆవిష్కరించారు. సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం అందిస్తుండటంపై ఎస్టీయూ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పీ సుధాకర్‌రెడ్డి, సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ బాలచందర్‌రెడ్డి, ఏ ఆడమ్స్ పాల్గొన్నారు.