సంక్షేమానికే మా ప్రాధాన్యం

-రాష్ట్ర బడ్జెట్‌లో అగ్రతాంబూలం దానికే..
-అశాస్త్రీయతకు తావుండని రీతిలో బడ్జెట్
-గ్రామీణ ప్రాంత ప్రజల ఆశలను నెరవేర్చుతాం
-వంద రోజుల పాలన ప్రజలు మెచ్చారు
-టీ మీడియాతో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్

Eetala Rajendar

(టీ మీడియా ప్రతినిధి, సిద్దిపేట): రాష్ట్ర తొలి బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. తెలంగాణ ప్రజల ఆశలు ఆశయాలకు అనుగుణంగా వాస్తవిక దృక్పథం- నిర్మాణాత్మకమైన ఆలోచనల మేలుకలయికగా బడ్జెట్ రూపొందుతుందని చెప్పారు. వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్ రంగా లకు భారీ వాటాలు ఉంటాయన్నారు.

గ్రామీణ ప్రజల అవసరాలను తీర్చేందుకు ఆ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కల్పన ప్రధానాంశంగా ఉంటుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల ఆశయాలకు బడ్జెట్ ప్రతిపాదనలకు పొంతన ఉండేది కాదన్నారు. ప్రభుత్వం చెబుతున్నట్టు రీ ఇన్వెంటెడ్.. రీ ఓరియెంటెడ్ అనే విధంగా శాస్త్రీయ పద్ధతిలో బడ్జెట్ రూపకల్పన చేయబోతున్నామని వివరించారు. కేసీఆర్ నేతృత్వంలోని వంద రోజులు టీఆర్‌ఎస్ పాలన ప్రజలు మెచ్చేదిగా ఉందని, ఏ ప్రభుత్వం తీసుకోనంతగా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాబోయే బడ్జెట్‌పై పలు అంశాలను టీ మీడియాకు ఈటెల వివరించారు.
టీ మీడియా:- సమైక్య రాష్ట్రంలో వివక్షకు గురైన తెలంగాణ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఎలాంటి బాట వేయబోతున్నది ?

ఈటెల:- తెలంగాణ వివక్షకు గురైన మాట వాస్తవం. నిధుల కేటాయింపులో అన్యాయం జరిగిన మాటా వాస్తవం. ఇప్పుడు మనరాష్ట్రంలో మనమే ఉన్నాం. తెలంగాణ పైసలు తెలంగాణకే ఖర్చుపెట్టే సదవకాశం వచ్చింది. మన తొలి బడ్జెట్ అభివృద్ధికి బాట వేసే విధంగా పక్కా ప్లాన్‌డ్‌గా ఉంటదని ఖచ్చితంగా చెప్పగలను.

టీ మీడియా:- ఏ ఏ రంగాలకు ప్రాధాన్యమివ్వబోతున్నారు ?
ఈటెల:- మా మొట్టమొదటి ప్రాధాన్యం నిస్సందేహంగా సంక్షేమమే. పేదల కండ్లలో నీళ్లుండగా మేమేదో గొప్పగా అభివృద్ధి చెందినమని చెప్పుకుంటే కుదరదు. రాష్ట్రంలో అత్యధిక జనాభా గ్రామాల్లో ఉంది. 60 శాతం రూరల్ పాపులేషన్ ఉంటుంది. వాళ్లకు ప్రభుత్వ సహకారం అందించాలి. అందుకే ప్రభుత్వం రైతులకు రుణాల మాఫీ, మళ్లీ రుణాలు ఇచ్చే స్కీం, మహిళలకు వడ్డీ లేని రుణం, పెన్షన్లు పెంపు, పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య..వైద్యం అందించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతులకు కళ్యాణలక్ష్మి పథకం వంటి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించడం ప్రభుత్వ మొదటి ప్రాధాన్యంగా ఉంటది. రెండవ ప్రాధాన్యం వ్యవసాయానికి ఉంటుం ది. వ్యవసాయానికి కావాల్సిన ఇరిగేషన్‌కు తగినంత నిధులు కేటాయిస్తం. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ఆ రంగంలో ప్రాధాన్యతగా ఉంటది. మూడోది కరెంటు. ఉత్పత్తి పెంచుకోవడంతో సమస్యలు పరిష్కరించుకోవడం జరుగుతుంది. త ర్వాత హరితహారం, పరిశ్రమల అభివృద్ధి, ఐటీ రంగం విస్తృ తి, పట్టణాల అభివృద్ధి ఇలా అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలనేదే లక్ష్యంగా ఉంటుంది. అదేబడ్జెట్‌లో ప్రతిబింబిస్తుంది.

టీ మీడియా:- వైద్య రంగానికి బడ్జెట్‌లో ఎలాంటి ప్రాధాన్యత ఉండబోతోంది ?
ఈటెల:- వైద్యరంగమే కాదు అనేక రంగాల్లో పాత ఒరవడి ఉండదు. రీ ఇన్వెంటెడ్ అండ్ రీ ఓరియేంటెడ్ అని ఏదైతే చెబుతున్నమో అక్షరాలా దాన్ని ఆచరించి చూపిస్తం. ఆశాస్త్రీయతకు తావు లేకుండా రేషనలిస్టిక్‌గా నిర్ణయించాల్సిన ప్రతిపాదన ఉంది. వైద్య రంగాన్ని కూడా మొత్తం స్ట్రీమ్‌లైజ్ చేస్తం.

టీ మీడియా:- గ్రామీణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రంమీద బాగా ఆశలు పెట్టుకున్నారు….

ఈటెల:- ఇప్పటికే మేము మనఊరు-మన ప్రణాళిక, మన మండలం-మన ప్రణాళిక, మన జిల్లా-మన ప్రణాళిక కార్యక్రమంలో వాళ్లకు ఏం కావాలో తెలుసుకున్నం. వాళ్లకి కావల్సింది తాగునీళ్లు, డ్రయిన్లు, సీసీ రోడ్లు, వాళ్ల ఉళ్లకు రోడ్లు, పంట పొలాలకు మట్టి రోడ్లు, తెల్లరేషన్‌కార్డులు, స్కూలు భవనాలు, ఆసుపత్రి భవనాలు, గ్రామపంచాయితీ భవనం, మహిళా సంఘ భవనం, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం.. ఇలా వారి ప్రాధాన్యతలు మా దృష్టికి వచ్చినై. ఇప్పటిదాకా ప్రభుత్వ కేటాయింపులు ఒక రకంగా ఉంటే, ప్రజల అవసరాలు మరో రకంగా ఉండేది.

కాని ఈ రోజు ప్రజల అవసరాలకు అనుగుణంగానే మా బడ్జెట్ ప్రణాళిక..కేటాయింపులు ఉంటయి. ఇవాళ పట్టణాల నుంచి మొదలు కొని తాండాల వరకు ప్రతి గ్రామానికి తాగునీరు అందించాలనేటువంటిది కేసీఆర్ గారి ఆలోచన. సిద్దిపేటలో ఎట్లయితే మానేరు నుంచి నీళ్లు తీసుకొచ్చి ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి ఇస్తున్నరో అదే పద్ధతిలో ఒక వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసి ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా ఉంది. అది కూడా అమలు చేయడానికి ఆలోచిస్తున్నం.