సంక్షేమ ఫలాలు అందరికీ అందాలి

-క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందేలా చూడండి
-నిధులను ఈ నెలాఖరులోగా ఖర్చు చేయండి
-బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ల సమీక్షలో మంత్రి జోగు రామన్న

Jogu Ramanna review meet on BC welfare

ప్రభుత్వ సంక్షేమ ఫలాలను క్షేత్రస్థాయిలో లబ్ధిదారులందరికీ అందేలా చూడాలని బీసీ సంక్షేమ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలోని తన చాంబర్‌లో బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ల పనితీరు, బీసీ సంక్షేమ శాఖలోని ఖాళీల భర్తీపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన నిధులను ఈనెలాఖరులోగా ఖర్చు చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. నిధుల వినియోగంలో బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ల ఉన్నతాధికారులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పనితీరు పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులను ఆశించిన స్థాయిలో ఖర్చు చేయకపోవడానికి కారణాలేమిటో చెప్పాలని ప్రశ్నించారు.

లబ్ధిదారులను ఆదుకోవడంలో అధికారులు నిర్లిప్తంగా ఉంటున్న్నారని మంత్రి మండిపడ్డారు. అలసత్వం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ల కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ధోబీఘాట్ల నిర్మాణాల ప్రగతిపై కూడా మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. 208 ధోబీఘాట్లు మంజూరైతే.. ఇప్పటికీ సగం కూడా పూర్తికాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ధోబీఘాట్ల నిర్మాణాలకు స్థల సేకరణ సమస్యలుంటే అత్యాధునిక యంత్రాలతో బట్టలను ఉతికేందుకు ప్రణాళికలు రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. సంచార జాతులకు చెందిన 2,600 మంది విద్యార్థులకు హాస్టళ్లలో ప్రవేశాలు కల్పించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ శాఖతోపాటు కార్పొరేషన్, ఫెడరేషన్లలో ఉన్న ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి టీ రాధా, బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్ కే అలోక్‌కుమార్, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్లు, డీబీసీడబ్ల్యూవోలు, బీసీ కార్పొరేషన్ ఈడీలు పాల్గొన్నారు